లోక్‌సభ రెండో దశ పోలింగ్ ప్రశాంతం

Date:18/04/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ మినహా దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాయ్‌గంజ్ టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా.. దంతెవాడలో మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ఇవి మినహా దేశంలో మిగిలిన చోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచే ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇదిలా ఉంటే, జమ్మూకశ్మీర్‌లో ఓ కొత్త జంట పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేసింది. అప్పుడే పెళ్లి జరిగినా తమ బాధ్యతను విస్మరించకుండా ఓటు హక్కును వినియోగించుకుని శభాష్ అనిపించింది. ఉదంపూర్‌కు చెందిన ఈ కొత్త జంట పెళ్లి తంతు పూర్తికాగానే పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేశారు. ఈ సందర్భంగా వరుడు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ‌తో మాట్లాడుతూ.. ‘వివాహ వేడుక కనీసం రెండు మూడు రోజుల పాటు జరుగుతుంది. మనం కనీసం 10 నిమిషాలు కేటాయించి ఓటు వేయాలి. ఇది మన హక్కు’ అని వెల్లడించారు. మరో ఐదేళ్ల పాటు మనల్ని పాలించే నాయకుడిని ఎన్నుకుంటాం కాబట్టి ఓటు వేయడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఒక వేళ మనం ఓటేయకపోతే ఎన్నికైన నాయకుడిని ప్రశ్నించే అధికారం కూడా కోల్పోతామని తెలిపారు. వరుడు పక్కనే ఉన్న వధువు మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ఓటింగ్ చాలా ముఖ్యమని అన్నారు. మనం కచ్చితంగా ఓటేసి దేశ అభివృద్ధికి భరోసా ఇవ్వాలని తెలిపారు. మరోవైపు కర్ణాటకలోనూ ఓ కొత్త పెళ్లికూతురు పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేశారు. పెళ్లి ముహూర్తానికి ఇంకా సమయం ఉండటంతో పెళ్లికూతురుగా ముస్తాబై పట్టుచీర, నగలు ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళూరు నియోజకవర్గంలోని కవూర్‌‌కు చెందిన కార్తిక.. గాంధీనగర్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. అనంతరం కొవూర్‌లోని పెళ్లి మండపానికి బయలుదేరారు.
Tags:Second phase of Lok Sabha polls are peaceful

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *