రైతులకు విత్తనాల కొరత

seeding-of-crops-to-farmers

seeding-of-crops-to-farmers

Date:22/09/2018
ఒంగోలు ముచ్చట్లు:
సాగర్‌ కుడికాలువ పరిధిలో ప్రకాశం జిల్లాలో 1.85 లక్షల ఎకరాల్లో వరిసాగు కానుంది. కొమ్మమూరు కెనాల్‌ పరిధిలో 72,800 ఎకరాలు ఉండగా గుండ్లకమ్మతో పాటు చెరువుల పరిధిలోని ఆయకట్టుతో కలుపుకుంటే  మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. తొందరగా దిగుబడి ఇచ్చే వరి రకాలను సాగు చేయాలని ఇప్పటికే వ్యవసాయ అధికారులు సూచించారు. ప్రధానంగా  ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 తోపాటు ఎన్‌ఎల్‌ఆర్‌ 145 రకాలను సాగు చేయాలని అధికారులు సూచించారు.
ప్రభుత్వమే ఏపీ సీడ్స్‌ ద్వారా వరి విత్తనాలు సరఫరా చేస్తుందని అధికారులు ప్రకటించారు. అధికారిక గణాంకాల ప్రకారం  ప్రస్తుతం సాగవనున్న విస్తీర్ణానికి 80 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం. ఏపీ సీడ్స్‌ వద్ద మూడు వేల క్వింటాళ్ల ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 రకం విత్తనాలు మాత్రమే ఉన్నాయి. జిల్లా రైతాంగం దాదాపు 50 శాత విస్తీర్ణంలో ఎన్‌ఎల్‌ఆర్‌ 145 రకం వరి సాగుచేస్తారు. ఈ రకం తక్కువ నీటితో పండించుకోవచ్చు. పైపెచ్చు 130 రోజుల్లోనే పంటకాలం ఉంటుంది.
ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో వినియోగిస్తుంది . దీంతో రైతులు సులభంగానే మద్దతు ధరతో ధాన్యాన్ని అమ్ముకొనే వెసులు బాటు ఉంటుంది. అందుకే రైతులు ఈ రకం వరి విత్తనాలకోసం ఎదురు చూస్తుంటారు. కానీ ప్రభుత్వం  ఎన్‌ఎల్‌ఆర్‌ 145 రకం విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకరాలేదు. ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 విత్తనాలను.. అది కూడా 80 వేల క్వింటాళ్లు అవసరమైతే మూడు వేల క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉంచింది. ఈ విత్తనాలు 12 వేల ఎకరాలకు మాత్రమే సరిపోతాయి.
దీంతో రైతులు రెండు రకాల విత్తనాలకోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.ప్రభుత్వం ఏపీ సీడ్స్‌ ద్వారా తగినన్ని విత్తనాలు సరఫరా చేయకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద విత్తనాలు అధిక రేట్లకు కొనాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం సరఫరా చేస్తున్న ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 రకం విత్తనాలు (25 కిలోల బస్తా) కిలో రూ.28.15 ప్రకారం రూ.703.75గా ఉంది. ప్రభుత్వం కిలోకు రూ.5 సబ్సీడీ ఇస్తోంది. సబ్సీడీ పోను రైతు రూ.588.75 చెల్లించాలి. కానీ ఇవే ఇత్తనాలు బయట మార్కెట్‌లో  రూ. 1300 అమ్ముతున్నారు.
తప్పనిసరి పరిస్థితిలో రైతు అదనంగా రూ.711.25 చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు  50 శాతం రైతులు సాగు చేసే ఎన్‌ఎల్‌ఆర్‌ 145 రకం విత్తనాలు ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. దీంతో రైతుల ఈ రకం విత్తనాలను ప్రైవేటు వ్యాపారుల వద్ద అధికధరలు వెచ్చించి కొనాల్సి వస్తోంది. ప్రస్తుతం  మార్కెట్‌లో ఎన్‌ఎల్‌ఆర్‌ 145 రకం 30 కిలోల బస్తా రూ.2 వేల నుంచి 2200 వరకూ అమ్ముతున్నారు. ఒక పక్క ఎన్‌ఎల్‌ఆర్‌ 145 రకం విత్తనాలు అధికంగా సాగుచేయాలని సూచిస్తున్న వ్యవసాయాధికారులు విత్తనాలను మాత్రం సరఫరా చేయకపోవడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
ప్రభుత్వ పెద్దలతో పాటు కొందరు అధికారులు సీడ్‌ వ్యాపారులతో కుమ్మక్కై  ప్రభుత్వం ద్వారా విత్తనాలు సరఫరా చేయడం లేదన్న  విమర్శలున్నాయి. దీని వెనుక రూ.కోట్లలో చేతులు మారినట్లు ప్రచారం సాగుతోంది. నాలుగేళ్లుగా జిల్లాలో కరువు తాండవిస్తోంది. పశ్చిమ ప్రకాశం తో పాటు తూర్పు ప్రాంతంలోనూ పంటలులేవు. దీంతో రైతాంగం కుదేలయింది.
ఈ పరిస్థితిలో  ఈ ఏడాది సాగర్‌ నీళ్లు వస్తున్నాయి. కనీసం ఇప్పుడైనా ఒక పండించుకుందామంటే కొనలేని పరిస్థితిలో విత్తనాల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రైవేటు దోపిడీని అరికట్టాల్సి  ప్రభుత్వం వ్యాపారులకు కొమ్ముకాయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వ్యాపారుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. ఏపీ సీడ్స్‌ ద్వారా రైతులకు  వరి విత్తనాలను సరఫరా చేయాలి.
Tags:Seeding of crops to farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *