పెట్రోల్, డీజిల్ పై స్వీయ నియంత్రణ

Date:23/10/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
పెట్రోల్‌, డీజిల్‌ వినియోగంలో స్వీయ నియంత్రణ విధించుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్ని చైతన్యం చేయాలని కేంద్రం భావిస్తోంది. అలాగే నిర్దిష్ట కాలపరిమితి చెల్లిన వాహ నాలు కాలుష్యంతో పాటు అధిక ఇంధన వినియోగానికి కారణమౌతున్నందున వాటిని వది లించుకోవాలని కూడా సూచించేందుకు సిద్దమౌతోంది. వ్యక్తిగత వాహ నాల వినియోగాన్ని వీలైనంతగా తగ్గించి ప్రజారవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని కూడా ప్రజల్ని కోరనుంది. ఇందుక్కారణం దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం వేగంగా పెరుగుతోంది. అదే స్థాయిలో వీటి దిగుమతికి కేంద్రంపై ఆర్ధిక భారం భారీగా పడు తోంది. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసే పరిస్థితి ఏర్పడుతుంది.ఈ ఏడాది ఆగస్టులో దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు 17.98 మిలి యన్‌ టన్నులు జరిగాయి.
గతేడాది ఆగస్టులో ఇది 16.91 మిలియన్‌ టన్నులు మాత్రమే. సరిగ్గా గతేడాది ఆగస్టుతో పోలిస్తే సుమారు ఐదుశాతం పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాల్లో వృద్ది చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌ వినియోగం 26మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు లేదా 35.36 బిలియన్‌ లీటర్లకు చేరుకుంది. దేశ జనాభా 132 కోట్లు కాగా సగటున ఏడాదికి ప్రతి వ్యక్తి 26.78 లీటర్ల పెట్రోల్‌ వినియోగిస్తున్నాడు. అలాగే డీజిల్‌ వినియోగం 82మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు లేదా 98.40బిలియన్‌ లీటర్లకు పెరిగింది. ప్రతి వ్యక్తి ఏటా సగటున 74.54లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నాడు.
చైనాలో ఇందన సగటు వినియోగం 476లీటర్లుగా ఉంటే భారత్‌లో 175.3లీటర్లే. అయితే చైనాలో వినియోగిస్తున్న పెట్రోలియం ఉత్పత్తుల్లో 49.48శాతం మాత్రమే దిగుమతులు. అదే భారత్‌ కొచ్చేసరికి 78.35శాతం దిగుమతులపైనే ఆధాపడాల్సొస్తోంది.దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం వేగంగా పెరుగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ దిగజారిపోతోంది. ఈ రెండింటి కారణంగా పెట్రోల్‌పై చెల్లించాల్సిన విదేశీ మారకద్రవ్యం పెద్దెత్తున ఖర్చైపోతోంది. ఇది భారత ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పిజిల విక్రయాలపై సబ్సిడీల్ని తొలగించిన ప్రభుత్వం ఇకముందు వీటి వినియోగానికి రేషన్‌ విధానాన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు స్పష్టమౌతోంది. పెట్రో భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పటికే ప్రధాని సంబంధిత మంత్రులు, అధికారులు, నిపుణుల్తో పలుమార్లు సమావేశాలు జరిపారు. తక్షణం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్ని అందుబాటులోకి తెచే ఆలోచన చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని వీలైనంత తగ్గించే మార్గాలపై చర్చలు జరిపారు. ప్రత్యామ్నాయంగా విద్యుత్‌ వాహక వాహనాల్ని పెద్దసంఖ్యలో అందుబాటులో తేవాలని ప్రతిపాదించారుఈ దశలో ప్రజల్ని పెట్రోల్‌, డీజిల్‌ వినియోగంలో స్వీయ నియంత్రణ పాటించే విధంగా చైతన్యపర్చాలని కేంద్రం నిర్ణయించింది.
పెట్రోల్‌, డీజిల్‌లకు రేషన్‌ విధానం పెట్టాలని కూడా ప్రతిపాదించింది. స్కూటర్లు, కార్లు, లారీలు, ఇలా వాహనాన్ని బట్టి నిర్ధిష్ట పరిమాణాన్ని మాత్రమే వినియోగానికి అనుమతించాలని భావిస్తోంది. అలాగే కాలపరిమితి తీరిన వాహనాలు కాలుష్యంతో పాటు ఇంధనాన్ని అధికంగా వినియోగిస్తున్నందున నిర్దిష్ట కాలపరిమితి దాటిన వాహన వినియోగాన్ని కఠినంగా కట్టడి చేయాలని కూడా నిర్ణయించింది. వీటితో పాటు ప్రజారవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చి ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలన్న వ్యూహాలక్కూడా పదునెడుతోంది. ఎన్నికల ముందు లేదా ఎన్నికల తర్వాత ఏదో సమయంలో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగంపై ఆంక్షలు, రేషన్‌ విధానం అమల్లోకి తేవాలన్న కృతనిశ్చయంతో ఉంది.
Tags:Self-control over petrol and diesel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *