అయినకాడికి అమ్ముకుంటున్న పత్తి

విజయనగరం ముచ్చట్లు:


పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కర్రివలసకు చెందిన రౌతు విశ్వేశ్వరరావు రెండు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. సుమారు రూ.40 వేల వరకు పెట్టుబడి అయింది. పత్తి విక్రయించాలంటే సుమారు 25 కిలోమీటర్ల దూరంలోగల సాలూరు మార్కెట్‌ యార్డు పరిధిలోని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలి. ఇప్పటికే అక్కడికి తీసుకెళ్లిన రైతులకు నిబంధనల పేరిట ధర తగ్గించడం లేదా వెనక్కి పంపేయడం వంటి పరిస్థితులు ఎదురవడంతో గ్రామానికి వచ్చిన వ్యాపారులకే క్వింటాలును రూ.6,300 చొప్పున పది క్వింటాళ్ల పత్తిని విశ్వేశ్వరరావు తెగనమ్ముకున్నారు. దీంతో, మొదటి దఫా ఏరివేతలోనే రూ.7,200 దోపిడీకి గురయ్యారు.మక్కువ, సాలూరు తదితర మండలాల్లో క్వింటాలు పత్తిని రూ.6 వేల చొప్పునే దళారులు కొనుగోలు చేశారు. దీంతో, రైతులు ఆ మేరకు నష్టపోయారు. పార్వతీపురం మన్యంతోపాటు విజయనగరం జిల్లాల్లోని రైతుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఈ రెండు జిల్లాల్లో ఒక్కొక్క కొనుగోలు కేంద్రం చొప్పున మాత్రమే కేంద్రం ఏర్పాటు చేయడం, కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లినా కొంటారనే, మద్దతు ధర ఇస్తారనే నమ్మకం లేకపోవడంతో రైతులు ప్రయివేట్‌ వ్యాపారులకే పత్తిని అమ్ముకోవాల్సి వస్తోంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిర్వాకంతో పత్తి రైతులు దగా పడుతున్నారు.

 

 

 

ప్రభుత్వ వైఖరి ప్రయివేటు వ్యాపారులకు వరంగా మారింది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర అమలు కావడం లేదు. దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. దీంతో, పత్తి రైతులు ఈ ఏడాది కూడా అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వరి, మొక్కజొన్న తరువాత పత్తినే అధికంగా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది సీజన్‌ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ పార్వతీపురం మన్యం జిల్లాలో 17 వేల ఎకరాల్లో, విజయనగరం జిల్లాలో 3,322 ఎకరాల్లో వేశారు. చీడపీడల సమస్య పెద్దగా లేకపోవడంతో ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాదైనా ఎంతోకొంత మిగులుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. గత ఏడాది ఎకరా పత్తి సాగుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడి అయింది.

 

 

 

ఈ ఏడాది పెరిగిన ట్రాక్టర్‌ అద్దెలు, విత్తనాలు, ఎరువుల ధరల వల్ల రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి అయిందని రైతులు తెలిపారు. గతేడాది క్వింటాలు పత్తి ధర రూ.6,380 ఉండగా, ఈ ఏడాది రూ.7,020గా కేంద్రం ప్రకటించింది. పెంచిన రూ.640 మద్దతు ధర పెరిగిన పెట్టుబడికి అనుగుణంగా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ తీవ్ర అలసత్వం ప్రదర్శించింది. పత్తి ఏరివేత మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశ మిగతా 2లో సెప్టెంబర్‌లోనే ప్రారంభమైంది. కానీ, రెండు రోజుల క్రితం వరకు ఈ రెండు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. రెండు రోజుల క్రితం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, విజయనగరం జిల్లా రాజాంలో ఏర్పాటయ్యాయి. ఈ రెండు కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకురావడానికి రైతులు అధిక వ్యయప్రయాసకు గురికావాల్సి వస్తోంది. తీరా తీసుకొచ్చాక ఇ-క్రాప్‌ నమోదు కాలేదనే నెపంతో తిరస్కరించడం, తేమ పేరుతో ధర తగ్గించడం చేస్తున్నారు. దీంతో, గ్రామాల్లోకి వస్తున్న పత్తి వ్యాపారులకు రైతులు తెగనమ్ముకోవాల్సి వస్తోంది.

 

Tags: Selling cotton to Ayinakadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *