అన్నమయ్య సాహిత్యంపై సెమినార్- అధికారులకు టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి ఆదేశం
తిరుపతి ముచ్చట్లు:
అన్నమయ్య సాహిత్యం పై త్వరలో పండితులతో సెమినార్ నిర్వహించాలని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. అన్నమయ్య రాసిన ఆధ్యాత్మిక, శృంగార, భక్తి, సంకీర్తనల్లో ఉన్న లోతైన భావాన్ని మరింతగా జన బాహుళ్యం లోకి తీసుకుని వెళ్లడానికి ఇలాంటి సెమినార్లు ఎంతో ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. టీటీడీ పరిపాలన భవనంలో శుక్రవారం టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రగతిపై ఈవో సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో 18 మహా పురాణాల్లో ఇప్పటివరకు ఐదు పురాణాలను పరిష్కరించి ముద్రించి విడుదల చేయడం జరిగిందన్నారు. మరో నాలుగు పురాణాలు డిటిపి దశలో ఉన్నాయని చెప్పారు . మిగిలిన వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ వేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ రాసిన వేలాది కీర్తనలు దాస సాహిత్య ప్రాజెక్టు పరిష్కరించి పుస్తక రూపంలో తేవాలని చెప్పారు.

ముఖ్యమైన ఆలయాల్లో ప్రతి నెల సత్యనారాయణ స్వామి వ్రతాలు, హనుమాన్ చాలీసా పఠనం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, నాలాయర దివ్య ప్రబంధ ప్రాజెక్టు, పురాణ ఇతిహాస ప్రాజెక్టు, ఎస్ వి రికార్డింగ్ ప్రాజెక్ట్, హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఎస్ వి వేద ఉన్నత అధ్యయన ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్టు పై ఈవో సమీక్ష జరిపారు. జేఈవో సదా భార్గవి, టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి రాజగోపాల్ రావు, ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థా చార్యులు,అన్నమయ్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి విభీషణ శర్మ, ఏఈవో శ్రీరాములు సమీక్షలో పాల్గొన్నారు.
Tags:Seminar on Annamayya literature- TTD EO AV Dharma Reddy directed the officials
