ఉత్తమ్‌ రాజీనామాతో రేసులోకి సీనియర్లు

-ముందు వరుసలో రేవంత్‌.. పోటీలో కోమటిరెడ్డి

Date:05/12/2020

హైదరాబాద్‌ ముచ్చట్లు:

గ్రేటర్‌ ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. గెలుపు ముంగిట బొక్కబోర్లాపడింది. గతంలో చక్రంతిప్పిన గడ్డపైనే చతికలపడింది. ఓటమితో పోటీపడుతున్నట్లు నానాటికీ ప్రజాదరణ కోల్పోతుంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైన హస్తం పార్టీ.. ఈసారి కూడా అవే ఫలితాలను పునరావృత్తం చేసింది. కేవలం 2,24,528 ఓట్లు (5శాతం) దక్కించుకుని దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇతర పార్టీలను ఏమాత్రం ఎదుర్కోలేక ఓటమి ముందు తలవంచింది. ఇప్పటికే వరుస ఓటములతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీకి గ్రేటర్‌ ఎన్నికల​పరాజయం ఆ పార్టీ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓవైపు సీనియర్‌ నేతలు ఒక్కకరూ పార్టీని వీడి కాషాయతీర్థం పుచ్చుకుంటుండగా.. కార్యకర్తలు సైతం తమదారి తాము చూసుకుంటున్నారు.

 

 

ఈ తరుణంలో టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు, ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రకటించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ పదవి నుంచి వైదులుగుతున్నట్లు ఓ లేఖను విడుదల చేశారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను సైతం ప్రారంభించాలని ఏఐసీసీని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరపరాజయం నాటి నుంచి ఉత్తమ్‌ రాజీనామా కోసం పార్టీలోని ఓ వర్గం బలంగా డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పార్లమెంట్‌, దుబ్బాక ఉప ఎన్నిక, బల్దియా పోరులో ఓటములతో ఆ ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో పదవికి రాజీనామా చెయకతప్పలేదు.

రేవంత్‌ వర్సెస్‌ కోమటిరెడ్డి..!

ఉత్తమ్‌ కుమార్‌ రాజీనామాతో టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి వర్గంలో ఆశలు చిగురిస్తున్నాయి. పీసీసీ పదవీ బాధ్యతలు రేవంత్‌ను అప్పగిస్తారని ఆయన వర్గం నేతలు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నానాటికీ దిగజారిపోతున్న కాంగ్రెస్‌ పార్టీని ఆయన మాత్రమే గాడిలోపెట్టగలరని, కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురాగలరని బలంగా నమ్ముతున్నారు. అయితే ఇప్పటికే రేవంత్‌కు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని డిసెంబర్‌ 9న దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చసాగుతోంది.

ఈ క్రమంలోనే మరో అసమ్మతి వర్గం నిరసన స్వరాన్ని వినిపిస్తోంది. పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న సీనియర్లను కాదని టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు పీసీసీ బాధ్యతలు ఎలా ఇస్తారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి వర్గం బహిరంగంగానే నిలదీస్తోంది. ఈ మేరకు అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతోంది. పీసీసీ పదవి తమకే ఇవ్వాలని కోమటిరెడ్డి సోదరులు మీడియా ముఖంగా పలుమార్లు డిమాండ్‌ చేశారు. పదవి తమకు దక్కనిపక్షంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరతామని రాజ్‌గోపాల్‌ చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య పెను దుమారాన్నే లేపాయి. ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌ ఓటమి, ఉత్తమ్‌ రాజీనామా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలను ఆ పార్టీ నేతలు ఏ విధంగా ఎదుర్కొంటారనేది చూడాల్సిఉంది.

పుంగనూరు శ్రీ కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయం మంత్రి పెద్దిరెడ్డి చే టీటీడీకి అప్పగింత

Tags: Seniors into the race with the best resignation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *