Natyam ad

3 వేల కిలోమీటర్లు దాటిన షర్మిల పాదయాత్ర

హైదరాబాద్ ముచ్చట్లు:


వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర మంచిర్యాల జిల్లాలో మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.  జూలై 8న షర్మిల ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ)’ పేరుతో  రాజకీయ పార్టీ స్థాపించారు. అనంతరం  ‘ప్రజాప్రస్థానం’ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు.  గత సంవత్సరం అక్టోబర్ 20న  రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నుంచి ఆమె ఈ యాత్రను ప్రారంభించారు.  గతంలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి కూడా ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించారు.  అందుకే సెంటిమెంట్‌గా భావించి తన తండ్రిలాగే చేవెళ్ల నుంచి షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర మొదలుపెట్టారు.  తెలంగాణలోని హైదరాబాద్ మినహా అన్ని  ఉమ్మడి జిల్లా  మీదుగా షర్మిల యాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో  అధికార టీఆర్ఎస్‌ నేతలతోపాటు కాంగ్రెస్ నేతలపై ఆమె చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులపై చేసిన ఆరోపణలు రాజకీయంగా వేడి పుట్టించాయి. దీంతో ఆయా మంత్రులు, ఇతర నేతలు కూడా షర్మిలపై విమర్శలు చేశారు. టీఆర్ఎస్ నేతలు స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో అటు టీఆర్ఎస్ నేతలు, ఇటు షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పలు విమర్శలు ఎదురవుతున్నా వెనుకడుగు వేయకుండా షర్మిల తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.రాజకీయంగా పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరవుతున్న షర్మిల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో ప్రకటించారు. ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు.

 

 

 

 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ జనరల్ స్థానం. అలాగే ఇక్కడ సామాజిక సమీకరణాలు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాంతంలో వైఎస్సార్ అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అందువల్ల ఆమె పాలేరు నుంచి పోటీ చేయబోతున్నారు. షర్మిల పార్టీకి తెలంగాణలో ఆదరణ లభిస్తుందా లేదా అన్నదానిపై అనేక చర్చలు జరుగుతున్నాయి. షర్మిల రాజకీయంగా ప్రధాన స్రవంతిలోకి ఇంకా రాలేదని అంచనా వేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరు వినిపించలేదు. పార్టీ పెట్టిన తర్వాత రెండు సార్లు ఉపఎన్నికలు వచ్చాయి. హుజూరాబాద్‌లో పాటు మునుగోడు ఉపఎన్నికలు వచ్చినా.. షర్మిల పోటీ చేయలేదు. తమ బలం ఎంతో ప్రదర్శించాలని అనుకోలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వైఎస్ అభిమానులు ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ ఆమె పోటీకి ఆసక్తి చూపలేదు . దీంతో అసలు వైఎస్ఆర్ టీపీ గురించి ఎక్కడా చర్చ జరగలేదు. ఆమెకు ప్రధానంగా స్థానిక సమస్య ఎదురవుతోంది. తెలంగాణ రాజకీయ నేతగా ఎక్కువ మంది గుర్తించడానికి ఆసక్తి చూపించడం లేదు. పార్టీలో షర్మిల తప్ప గుర్తుంచుకునే మరొక నేత లేకపోవడం కూడా మైనస్ అవుతోంది. షర్మిల కోసం ఆమె తల్లి పని చేస్తున్నారు. కానీ ఎంత వరకు వర్కవుట్ అవుతుందనేది అంచనా వేయడం కష్టమే. అయితే షర్మిల మాత్రం పట్టిన పట్టు వీడకుండా.. మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి  చేశారు. ముందు ముందు పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆమె నమ్మకంగా ఉన్నారు.

 

Post Midle

Tags: Sharmila Padayatra which crossed 3 thousand kilometers

Post Midle