Natyam ad

షర్మిల వ్యూహాత్మకంగా  అడుగులు

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తానని పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాను ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నాననే చర్చకు ఫుల్ స్టాప్ పెడుతూ ఓ కంక్లూజన్ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరులో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు వెల్లడించారు. ఆమె ప్రకటనతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న వైఎస్సార్ టీపీ నుండి పోటీ చేయబోయే స్థానాన్ని ప్రకటించడం వెనుక షర్మిల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోందిగత ఎన్నికల్లో రాష్ట్రమంతటా టీఆర్ఎస్ గాలి వీచినా.. ఖమ్మంలో మాత్రం కారు పార్టీ ఎదురీదాల్సిన పరిస్థితి వచ్చింది. 2018 ఎన్నికల్లో పాలేరులో టీఆర్ఎస్ గెలుపొందినా.. అక్కడ నెలకొన్న గ్రూప్ రాజకీయాలు ప్రస్తుతం పార్టీ శ్రేణులను అయోమయంలోకి నెడుతోంది. కారు పార్టీలో రెండు వర్గాలు బాహాబాహీకి దిగుతున్నాయి. ఓ వైపు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వర్గం, మరో వైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గాలు సై అంటే సై అనడంతో అధిష్టానానికి వీరి వ్యవహారం తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ఇటీవల మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. అయినా వచ్చే ఎన్నికల్లో టికెట్ తమ వర్గానిదే అంటూ కొట్టకుంటున్నారు ఈ వర్గ పోరే తమకు ఇక్కడ కలిసి రాబోతోందనే అంచనాకు షర్మిల వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.పాలేరు నియోజకవర్గంలో సామాజిక వర్గంగా చూస్తే అక్కడ రెడ్లు తక్కువగానే ఉన్పప్పటికి.. జనరల్ కేటగిరిలోకి మారిన నాటి నుండి అధికారం రెడ్డి వర్గం చేతిలోనే అధికంగా ఉంది. ఈ భువన సుందర్ రెడ్డి సమితి ప్రెసిడెంట్ గా, జిల్లా పరిషత్ ఛైర్మన్ గా,

 

 

Post Midle

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా కొనసాగారు. పాలేరు జనరల్ గా మారిన తరువాత రామిరెడ్డి వెంకటరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేలుగా పని చేశారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత సంభాని చంద్రశేఖర్ మూడుసార్లు అసెంబ్లీలో అడుగు పెట్టి ఏకంగా మంత్రిగా పని చేశారు. రామిరెడ్డి వెంకటరెడ్డి సైతం మంత్రిగా పని చేశారు. తుమ్మల మంత్రిగా కొనసాగారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం కలిసి పోటీ చేశాయి. అయితే మిగతా చోట్ల ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లాలో మాత్రమే వైసీపీ సత్తా చాటింది. ఇక్కడ ఒక ఎంపీతో పాటు మూడు అసెంబ్లీ స్థానాలను వైపీసీ గెలుచుకుని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఇక్కడ కాంగ్రెస్, వైఎస్ అభిమానులు ఎక్కువ. అలాగే రాజకీయ పరిస్థితుల ప్రభావం తమకు అనుకూలంగా మారవచ్చనే అంచనాలతో ఖమ్మం జిల్లా పాలేరు నుండి అసెంబ్లీ వైపు షర్మిల కన్నేసినట్లు తెలుస్తోంది. షర్మిల తాజా ప్రకటనతో రాబోయే ఎన్నికల్లో పాలేరులో బహుముఖ పోరు ఖాయమనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. షర్మిల తాజా ప్రకటనతో ఈ నియోజకవర్గంపై టీఆర్ఎస్ ఆలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల నాటికి గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టకుంటే.. అది స్వయంకృతాపరాధమే అవుతుందని రాజకీయ పండితులు అంటున్నారు.

 

Tags: Sharmila steps strategically

Post Midle