Natyam ad

మైలేజ్ పాలిటిక్స్  బండి యాత్రను మించి షర్మిల అరెస్ట్

హైదరాబాద్ ముచ్చట్లు:


బీజేపీ అంటేనే గోరంత చేసి కొండంత ప్రచారం పొందే పార్టీ అన్నది రాజకీయ వర్గాలలో బాగా నానుతున్న ప్రచారం. అలాంటిది తెలంగాణలో తాజా ఘటనల నేపథ్యంలో బీజేపీ ఆ ప్రచారం పొందడం సంగతి అటుంచి.. అసలు ఎంతో ఆర్భాటం చేసి మరీ ప్రారంభమైన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఐదో విడత పాదయాత్ర.. ఆ సందర్భంగా భైంసాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అసలు గుర్తింపే లేకుండా పోయింది.  వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల అరెస్టు, తదననంతతర పరిణామాలు. తెలుగు రాష్ట్రాలలో మీడియా అటెన్షన్ నే కాదు.. ప్రజల అటెన్షన్ ను తన వైపు లాగేసుకుంది. షర్మిల అరెస్టు, న్యాయమూర్తి ముందు హాజరుపరచడం, వెంటనే వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల కావడం మొత్తం పోలిటికల్ హైడ్రామా నడిచింది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి షర్మిల ప్రగతి భవన్ ముట్టడి పేరుతో నిరసన కార్యక్రమం తలపెట్టారు. నర్సంపేటలో టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడిలో పాక్షికంగా ధ్వంసమైన తన కారును స్వయంగా నడుపుకుంటూ ఆమె ప్రగతి భవన్ వైపు వచ్చారు. పోలీసులు ఆమెను పంజాగుట్ట సర్కిల్ వద్ద అడ్డుకుని.. వాహనంలో నుంచి దిగాలని కోరారు.

 

 

 

అందుకు ఆమె నిరాకరించి డోర్ లాక్ చేసుకొని కారులోనే ఉండిపోయారు. వైఎస్సార్‌టీపీ ఆందోళనతో పంజాగుట్ట మార్గంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో  షర్మిల కారును పోలీసులు క్రేన్ సాయంతో లాక్కెళ్లారు. ఆ సమయంలో కూడా షర్మిల  వాహనంలోనే ఉన్నారు. పంజాగుట్ట నుంచి అమీర్‌పేట, మైత్రివనం మీదుగా ఆమె వాహనాన్ని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఆమెను అదుపులోకి తీసుకొని ఎస్సార్‌నగర్ పీఎస్‌లోకి తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించి, జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. నాంపల్లి కోర్టులో షర్మిలకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు అయింది. ఇక, ఆమెను పరామర్శించేందుకు షర్మిల తల్లి విజయమ్మ వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో విజయమ్మ లోటస్‌పాండ్‌లోని నివాసంలో నిరశన దీక్షకు దిగారు. షర్మిలను అరెస్టు చేసిన విషయం ఆమె భర్త అనిల్ కుమార్‌కు కూడా సమాచారం ఇచ్చారు.  ఈ మొత్తం వ్యవహారంలో..  బండి సంజయ్ పాదయాత్ర, భైంసా సభ ఎవరూ గుర్తించని కార్యక్రమంలా మిగిలిపోయింది.సీఎం కేసీఆర్ ను వ్యతిరేకించినందుకే షర్మిలను అరెస్ట్ చేశారని కొందరంటుంటే.. ఇది పక్కా టీఆర్ఎస్ ప్రణాళిక అంటే మరి కొందరు అంటున్నారు.    భైంసాలో బండి సంజయ్ పాదయాత్ర, బీజేపీ బహిరంగ సభ జరిగింది. అయితే షర్మిల అరెస్ట్ తో ఉదయం నుండి మీడియాలో, సామాజిక మాధ్యమంలో షర్మిల అరెస్టు, విజయమ్మ ఆందోళనకు సంబంధించిన సమాచారంతో నిండిపోయింది.  మరికొందరు కామెంట్లతో పెద్ద వార్ నడుస్తుంది.

 

 

 

Post Midle

మొత్తం మీద   మీడియాను, సామాజిక మాధ్యమాన్ని వాడుకుని నిత్యం వార్తలలో ఉండటం ద్వారా పాపులర్ అవుతుండే బీజేపీకి షర్మిల ఎపిసోడ్ దారుణంగా ఫెయిలయ్యింది.  తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిర్మల్ జిల్లాలో మొదలుపెట్టిన 5వ విడత పాదయాత్రను షర్మిల  ఎపిసోడ్ కారణంగా ఎవరూ పట్టించుకోలేదు. మరో వైపు రాష్ట్రంలో నిర్విరామంగా అలసట లేకుండా పాదయాత్ర చేస్తున్నా.. పాదయాత్రలో మూడు వేల కిలోమీటర్ల మైలు రాయిని దాటేసినా రాని గుర్తింపు షర్మిలకు మంగళవారం నాటి అరెస్టుతో  వచ్చేసింది. అయితే పరిశీలకులు మాత్రం షర్మిల అరెస్టు వ్యవహారమంతే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహ రచన ప్రకారమే జరిగిందని అనుమానిస్తున్నారు.ఇన్ని రోజులూ లేనిది ఇప్పుడు ఎందుకు షర్మిల పాదయాత్రపై దాడి జరిగింది?.. అలాగే ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన షర్మిలను అత్యంత నాటకీయంగా కారులో ఉండగానే క్రేన్ తో కారును లాక్కెళ్లి మరీ అరెస్టు చేయాల్సిన అవసరమేమొచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. అలాగే షర్మిల అరెస్టుకు నిరసనగా విజయమ్మ దీక్ష కూడా మీడియా కవరేజ్ ను బండి యాత్ర, భైంసా సభ నుంచి డైవర్ట్ చేసింది. ఇదంతా కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జరిగిందన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.

 

Tags: Sharmila’s arrest over Mileage Politics’ Bandi Yatra

Post Midle