తల్లిని కోల్పోయిన చిన్నారులకు అండగా నిలిచిన 

– పౌరసరఫరాల శాఖ వినియోగదారుల సహాయ కేంద్రం
– బాధితులకు రూ. 3 లక్షల నష్టపరిహారం
– నెల రోజుల్లో కేసు పరిష్కారం
Date:20/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ పౌరసరఫరాల శాఖ వినియోగదారుల సహాయ కేంద్రం మరోసారి బాధితులకు అండగా నిలిచింది. త్వరితగతిన నెల రోజుల్లో కేసును పరిష్కరించి బాధితులకు రూ. 3 లక్షల నష్టపరిహారం ఇప్పించింది. మెదక్ జిల్లా, కౌడిపెల్లి గ్రామానికి చెందిన సంతోష (45)  కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం స్థానికంగా ఉన్న ఉమా నర్సింగ్ హోంకు వెళ్లారు. నర్సింగ్ హోంకు చెందిన ఆర్ఎంపీ ప్రభాకర్ ఈ ఏడాది మార్చ్ 20న సంతోషకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఆర్ఎంపీ నిర్లక్ష్యంతో శస్త్రచికిత్స వికటించి మరుసటి రోజు మార్చ్ 21న సంతోష మృతి చెందారు.
చనిపోయే నాటికి సంతోషకు ఆరు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు, ఎనిమిది నెలల వయసు కలిగిన ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆర్ఎంపీ నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన సంతోష సోదరుడు స్వామి కౌడిపెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.  ఆర్ఎంపీ నిర్లక్ష్యంతో తల్లిని కోల్పోయి దిక్కులేని స్థితిలో ఉన్న ముగ్గురు చిన్నారులకు ఏ విధంగానైనా ఆర్థికంగా తోడ్పడాలనే ఉద్దేశంతో స్వామి ఆర్ఎంపీపై న్యాయ పోరాటానికి దిగారు.
అయితే న్యాయపోరాటానికి కనీస ఖర్చులు కూడా భరించే స్థితిలో లేని ఆ నిరుపేద కుటుంబం  పౌరసరఫరాల శాఖ వినియోగదారుల సహాయ కేంద్రంలో ఉచితంగా సమస్యను పరిష్కరిస్తారని తెలుసుకొని సెప్టెంబర్ 22న కేంద్రాన్ని ఆశ్రయించారు.  ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సహాయ కేంద్ర నిర్వాహకులు ఆర్ఎంపీకి నోటీసులు జారీచేశారు. నెల రోజుల్లో కేసును పరిష్కరించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.  వినియోగదారుల సహాయ కేంద్రం ఆదేశాల మేరకు బాధితులకు నష్టపరిహారం కింద రూ. 3 లక్షలు ఇవ్వడానికి అంగీకరించారు. శనివారం నాడు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ బాధిత కుటుంబానికి నగదును అందజేశారు.
Tags:She stood up for the lost children

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *