స్వచ్ఛాసుపత్రిగా శాలిగౌరారం పీహెచ్‌సీ

 Date:11/08/2018
నల్గొండ ముచ్చట్లు:
నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం పీహెచ్‌సీ స్వచ్ఛతలో టాప్‌ మార్కులు సొంతం చేసుకుంది. పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తూ, రోగులకు ప్రైవేటుకు దీటుగా వైద్య సేవలందిస్తున్న ఆసుపత్రిగా గౌరవం దక్కించుకుంది. ఈ హాస్పిటల్‌ కాయకల్ప స్వచ్ఛభారత్‌ పథకంలో భాగంగా జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాల పరిశీలనలో 87.2 మార్కులు సాధించి జిల్లాలో ఉత్తమ పీహెచ్‌సీగా నిలిచింది. సర్కారు ఆసుపత్రులు స్వచ్ఛబాట పట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. జాతీయస్థాయి అధికారులు క్షేత్ర పరిశీలన అనంతరం ప్రకటించిన ఫలితాల్లో శాలిగౌరారం ఆసుపత్రి జిల్లాస్థాయిలోనే ప్రథమస్థానంలో  నిలిచింది. దీంతో ఆసుపత్రి సిబ్బందితో పాటూ ఇక్కడి వైద్య కోసం వచ్చేవారూ ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలాఉంటే వేములపల్లి పీహెచ్‌సీ 82 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచింది. గత నాలుగు నెలల కాలంలో ఇక్కడ ఎలాంటి శస్త్రచికిత్సలు లేకుండా 120 సాధారణ ప్రసవాలు, మండలంలో సుమారు రెండు వేలకు పైగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.సర్కారీ దవాఖానాల్లో పరిశుభ్ర వాతావరణం ఉండేలా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆసుప్రతిని పరిశుభ్రంగా ఉంచుతూ మెరుగైన వైద్య సేవలందిస్తే జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాల పురస్కారంలో ప్రత్యేక నిధులు కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందటే ప్రకటించింది. ప్రాంతీయ, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు గ్రేడింగ్‌ బట్టి నిధులు అందిస్తామని తెలిపింది. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఉండడంతో శాలిగౌరారం పీహెచ్‌సీ స్వచ్ఛత పురస్కారానికి ఎంపికైంది. ఇదిలాఉంటే ఈ ఆరోగ్య కేంద్రాన్ని జులై 5నే జాతీయస్థాయి అధికారులు పరిశీలించారు. ఇక్కడి సౌకర్యాలు, పరిశుభ్రతను ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారు. మొత్తంగా శాలిగౌరారం పీహెచ్‌సీ కృషికి ఫలితం దక్కింది. 87 మార్కులతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఇదిలాఉంటే ఈ ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు వైద్యాధికారి. ఆసుపత్రిలో స్వచ్ఛత పాటించడంతో పాటు మొక్కల పెంపకం కోసం ప్రత్యేక ఆవరణాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆసుపత్రితో పాటూ అక్కడి పరిసరాలూ ఆహ్లాదంగా మారాయి.
Tags:Shiloghooram Phrase

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *