ఓడలు బళ్లు… బళ్లు ఓడలు

-ఏపీలో నయా రాజకీయం

Date:13/07/2019

విజయవాడ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గత సర్కార్ హయాంలో చంద్రబాబు అండ్ టీమ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను అవమానించిన తీరు అంతా ఇంతా కాదు. జగన్ ను అసలు విపక్ష నేతగా కూడా పరిగణించకుండా పదేపదే మైక్ లు కట్ చేస్తూ అధికారపక్షానికి చెందిన మంత్రులు, ఎమ్యెల్యేలు హీనంగా, నీచంగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ దాడి సాగించేవారు. కొన్ని సందర్భాల్లో దీనికి తమ నిరసన తెలపాలనుకున్న వైసిపి వారిని మార్షల్స్ తో మెడపట్టి బయటకు గెంటేయడం, స్పీకర్ సస్పెన్షన్ లు విధించడం రొటీన్ గా జరుగుతూ వచ్చేవి. ఇలా జగన్ పై ముప్పేట దాడి జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి స్థానంలో వున్న చంద్రబాబు నవ్వుతూ ఆస్వాదించేవారు.

 

 

మొన్నటి ఎన్నికల్లో వైసిపి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చేసింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో ఓడ బండి … బండి ఓడ గా మారిపోయింది. విపక్షంలో వున్న జగన్ అధికారపక్షం వైపు, ఉంటే అధికారపక్షంలో వుండే చంద్రబాబు ప్రతిపక్ష స్థానంలో కూర్చున్నారు. ఇప్పుడు గతంలో టిడిపి చేసిన పనే వైసిపి చేస్తుంది. పదేపదే చంద్రబాబును ప్రతి వైసిపి మంత్రి, ఎమ్యెల్యే కించపరుస్తూ అవమానాల పాలు చేస్తున్నారు. ఇవన్నీ చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారు.

 

 

 

జరుగుతున్న తతంగం చూసి జగన్ చిరునవ్వులు చిందిస్తూ ఆస్వాదిస్తున్నారు.గతంలో జగన్ ఎన్ని అవమానాలు జరుగుతున్నా అసెంబ్లీలో పోరాడి నిలిచారు. అధికారపార్టీ పదేపదే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంతో విసుగెత్తి చివరి ఏడాది అసెంబ్లీని వైసిపి మొత్తం బహిష్కరించారు. ఇప్పుడు కొత్త సర్కార్ ఏర్పడి 45 రోజులు కూడా కాలేదు. చంద్రబాబు లో అసహనం పెల్లుబికుతుంది. తన కుమారుడి వయస్సు వున్న ముఖ్యమంత్రి అండ్ టీం చేస్తున్న మాటల దాడితో చంద్రబాబు చికాకు పడుతున్నారు.

 

 

 

ఇదే తీరు మరికొంతకాలం జరిగితే ఇక ఆయన అచ్చెన్నాయుడికి అసెంబ్లీ బాధ్యతలు అప్పగించి డుమ్మా కొట్టేస్తారన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఈ అవమానాలు భరించేందుకేనా నేను ఇక్కడికి వచ్చింది అంటూ తాజాగా చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.అంటే ఇకపై ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుని అసెంబ్లీ కి చంద్రబాబు బై చెప్పేందుకు ఇప్పటినుంచి అడుగులు వేస్తున్నారని విశ్లేషకుల భావన.

 

 

 

 

పదేపదే తనకు జరిగిన అవమానాలను ప్రస్తావిస్తూ ప్రజల్లో తన తప్పు లేదు ఈ కారణంతోనే తాను సభకు వెళ్ళడం లేదని చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నట్లు ఉందని అంటున్నారు. అదే జరిగితే అసెంబ్లీ చప్పగా సాగుతుంది. గతంలో జగన్ అసెంబ్లీ ని బాయ్ కాట్ చేసినప్పుడు సాగిన అసెంబ్లీ సమావేశాలపై ప్రజల్లో ఎలాంటి ఆసక్తి లేకుండా పోయింది.

 

 

 

 

అధికార విపక్షాల నడుమ చర్చలు అర్ధవంతంగా సాగినప్పుడే జనంలో చట్టసభల్లో చర్చల ను వీక్షించేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం విపక్ష నేత తీరు చూస్తే ఇక త్వరలో చంద్రబాబు అసెంబ్లీకి బై బై కొట్టి జగన్ లాగే జనంలో వుండే స్కీం ను అనుసరిస్తారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి అధికారపక్షం ఇకపై ఎలా వ్యవహరిస్తుందో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

 

హస్తినలో బాబు రాయబేరాలు.

Tags: Ships Ships … Ships Ships

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *