ఏపీ ‘రైల్వే జోన్‌’కు కేంద్రం షాక్!

Date:13/03/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ప్రత్యేక హోదా సాధ్యం కాదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిరాశకు గురించేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో షాక్ ఇచ్చింది. ఏపీ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిన ప్రత్యేక రైల్వే జోన్ సైతం సాధ్యం కాదని ప్రకటించింది. సోమవారం తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశమైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గాబా ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. రైల్వే జోన్ ఏర్పాటుపై వచ్చిన సాధ్యాసాధ్యాల నివేదికలు, సర్వేలు ఇందుకు అనుకూలంగా లేవని, రైల్వే బోర్డు సైతం దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు ఆయన చెప్పారని సమాచారం.ఆంధ్రప్రదేశ్ విభజనలోని అంశాలు, షెడ్యూల్‌ 13లోని అంశాలు, ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలనుకున్న కేంద్ర, విద్యా సంస్థల ఏర్పాటు తదితర విషయాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా రైల్వే జోన్‌పై ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ లేవనెత్తిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. రైల్వే జోన్‌ పై వచ్చిన నివేదికలన్నీ వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో అది సాధ్యం కాదనే విషయాన్ని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనితోపాటు దుగరాజపట్నంలో పోర్టు ఏర్పాటు కూడా కాకపోవచ్చని సమాచారం.అయితే, ప్రత్యేక హోదా మినహా అన్ని హామీలను కేంద్రం సక్రమంగా అమలు చేస్తుందని, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటన కూడా త్వరలోనే వస్తుందని బీజేపీ నేతలు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. ఏపీ రైల్వే జోన్ సాధ్యం కాదని తేలడంతో ఆందోళనలు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి.
Tags: Shock Center for AP ‘Railway Zone’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *