టీఆర్ఎస్ పార్టీకి షాక్‌

ఖమ్మంముచ్చట్లు:

అధికార టీఆర్ఎస్ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అలకబూనారు. తన విషయంలో అధిష్టానం స్పందించకుంటే పార్టీ మారతానని హెచ్చరించారు. మంగళవారం అశ్వరావుపేట ప్రెస్ క్లబ్‌లో స్థానిక నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఆయన అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు అనేక అవమానాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 18 ఖమ్మంలో జరిగిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డిల కృతజ్ఞత సభ సందర్భంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోనూ తన ఫొటో వేయలేదని పార్టీలో తన పాత్రను క్రమంగా తగ్గించే ప్రయత్నం జరుగుతోందని అసహానం వ్యక్తం చేశారు.ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో గిరిజన ప్రజా ప్రతినిధులకు అవమానాలే ఎదురయ్యాయని విమర్శించారు. 2018 ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్వగ్రామంలోనే టీఆర్ఎస్‌కు ఓట్లు వేయించలేకపోయారని, ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు వేయించే సత్తా తుమ్మలకు లేదంటూ సెటైర్లు వేశారు. తాను 1981లోనే సర్పంచ్‌గా గెలిచిన సీనియర్‌ నాయకుడినని ఈ లెక్కన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తనకంటే జూనియర్ అవుతాడని కామెంట్స్ చేశారు.ఇదిలా ఉంటే ఖమ్మంలో ఆధిపత్య పోరు టీఆర్ఎస్‌ను వేధిస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇటీవల మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు.

 

 

Post Midle

తుమ్మలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రూప్ రాజకీయాల స్వస్తి చెప్పాలని నేతలకు సూచించారు. కానీ అలాంటి పరిస్థితులు పార్టీలో కనిపించడం లేదని తాటి వెంకటేశ్వర్లు వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది. నాయకులందరినీ కలుపుకుని వెళ్లాలని జిల్లా నేతలకు కేటీఆర్ చేసిన దిశానిర్దేశం అమలు కావడం లేదని అన్నారు. తనకు జరుగుతున్న అవమానాల విషయంలో పార్టీ అధిష్టానం స్పందించకుంటే పార్టీ మారడం ఖాయమని స్పష్టం చేశారు.తాటి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ తరఫున 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బూర్గంపాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అనంతరం టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 లో వైసీపీ అభ్యర్థిగా అశ్వరావుపేట నియోజవకర్గం నుండి పోటీ చేసి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో వైసీపీని వదిలి టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యాడు. అయితే ఆ తర్వాత మెచ్చా నాగేశ్వరరావు సైతం టీఆర్ఎస్ గూటికి చేరడంతో ఇక్కడ ఆధిపత్య పోరు పొడచూపుతున్నాయి.

 

Tags: Shock to the TRS party

Post Midle
Natyam ad