రబీలో సాగు నీటికి కొరత

Date:18/02/2020

:ఒంగోలు ముచ్చట్లు

రబీలో జొన్న, మొక్కజొన్న సాగు చేసిన రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పొట్టదశకు చేరుకున్న పైర్లకు పొలాల్లో నీరు లేకపోవడంతో ఎండిపోతున్నాయి. దీనికి ప్రస్తుతం రైతులు ఆరుతడిని అందిస్తే గాని పైరు చేతికి దక్కని పరిస్థితి నెలకొన్నాయి. ప్రస్తుతం కృష్ణా-పశ్చిమ బ్యాంక్‌ కెనాల్‌ ద్వారా విడుదల చేసిన అరకొర సాగు నీరు రైతులకు అందక నానా అవస్థలు పడుతున్నారు. నాలుగు రోజుల నుండి సాగునీరు విడుదలైనా ప్రధాన కాల్వల పక్కనున్న పంట పొలాలకూ ఆయిల్‌ ఇంజిన్లకు నీరు అందడం లేదు. ప్రధాన కాల్వకు అందుబాటులో ఉన్న పంట పొలాలకే నీరు పూర్తిగా అందకపోతుండగా, దూరంగా ఉన్న పొలాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

 

 

 

సాగునీరు వారం రోజులు విడుదలవుతుందని అధికారులు చెబుతున్న క్రమంలో ఇప్పటికే నాలుగు రోజులైంది. అయినా వందల ఎకరాలు కూడా తడవలేదు. మిగతా పొలాల పరిస్థితి ఏమిటనే ఆందోళన సాగుదారుల్లో నెలకొంది.మండలంలో ఈ ఏడాది సుమారు ఎనిమిది వేల ఎకరాలకు పైగా జొన్న, మొక్కజొన్న పైర్లను రైతులు సాగు చేశారు. వీటిలో సుమారు మూడువేల ఎకరాల వరకు బోరు వసతి ఉన్నా మిగిలిన నాలుగు వేల ఎకరాల భూములకు సాగునీటి కాల్వలే ప్రధాన ఆధారం. జనవరిలో విడుదలైన నీటితో రైతులు పంట పొలాలకు వినియోగించుకునేందుకు అవకాశం దక్కలేదు.

 

 

 

 

అప్పుడే లేత దశలో ఉండడంతో ఈ పైరుకు నీరందించేందుకు రైతులు వెనుకంజ వేశారు. ప్రస్తుతం పొలాలు బెట్టకు వచ్చి, ఎండిపోయి సాగునీరు తప్పనిసరైంది. ఈ క్రమంలో 10-15 రోజుల నుండి సాగునీరు అందుతు ందని రైతులు ఆశగా ఎదురు చూశారు. నాలుగు రోజుల నుండి విడుదలైన సాగునీరు పొలాలకు అందకపోవడం రైతులను ఆవేదనకు గురిచేస్తోంది.

 

 

 

 

ఒక పక్క ఎండుతున్న పొలాలు, మరో పక్క ఇప్పటికే అధిక ఖర్చుల భారంతో రైతులు అల్లాడుతున్నారు. ఇదిలా ఉండగా అద్దేపల్లి, భట్టిప్రోలు, ఐలవరం గ్రామాల పొలాల కు వెల్లటూరు ఛానల్‌పై కనగాల వద్ద ఉన్న రెగ్యులేటర్‌ను కిందకు దించితే మినహా నీరందే పరిస్థితి లేదు. ఈ రెగ్యులే టర్‌ను కిందకు దించి ఈ ఎండుతున్న పొలాలకు సాగునీ రు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.

 

Tags: Shortage of cultivated water in Rabi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *