ఘనంగా ముగిసిన శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. జనవరి 7 నుండి శ్రీ ఆండాళ్ అమ్మవారికి నీరాటోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు బంగారు తిరుచ్చిపై శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి రామచంద్ర తీర్థ కట్టకు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడున్న మండపంలో అమ్మవారిని కొలువుతీర్చి వేడినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీ ఆండాళ్ అమ్మవారు బంగారు తిరుచ్చిపై శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అడుగుడుగునా హారతులు సమర్పించారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఆండాళ్ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ విఆర్.శాంతి, ఏఈఓ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ప్రసాదమూర్తిరాజు, భక్తులు పాల్గొన్నారు.

Tags; Shree Andal Niratotsavam ended grandly
