Natyam ad

శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం అరుదైన రికార్డ్

తిరుపతి ముచ్చట్లు:


నెల రోజుల్లో విజయవంతంగా రెండో గుండె మార్పిడి శస్త్ర చికిత్స. గ్రీన్ చానల్ కూడా లేకుండా పక్కా ప్రణాళికతో చెన్నై నుంచి తిరుపతికి గుండె తరలింపు. 13 నెలల పాపకు ప్రాణం పోసిన వైద్య బృందం. డాక్టర్లను అభినందించిన టీటీడీ ఈవో   ఎ వి ధర్మారెడ్డి. శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ( చిన్న పిల్లల గుండె ఆసుపత్రి) వైద్యులు నెల రోజుల వ్యవధిలో రెండవ గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి అరుదైన రికార్డు సృష్టించారు. పక్కా ప్రణాళిక తో గ్రీన్ చానల్ కూడా లేకుండా చెన్నైలో బ్రెయిన్ డెడ్ అయిన రెండు సంవత్సరాల బాలుడి గుండెను సేకరించి తిరుపతికి తీసుకుని వచ్చి 13 నెలల పాపకు ప్రాణం పోశారు. ఆసుపత్రిలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ఈ ఆపరేషన్ వివరాలను వెల్లడించారు.

గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన 13 నెలల పాపకు గుండె తీవ్రంగా దెబ్బతినింది. తల్లిదండ్రులు
ఆ పాప ను విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. పాపకు గుండె మార్చాల్సి ఉందని, తిరుపతి లో టీటీడీకి చెందిన శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె ఆసుపత్రికి వెళ్ళాలని డాక్టర్లు సూచించారు. మూడు నెలల క్రితం తల్లిదండ్రులు ఆ పాపను ఆసుపత్రికి తీసుకుని వచ్చి అడ్మిట్ చేశారు. పాపకు సరిపోయే గుండె కోసం వైద్యులు జీవన్ దాన్ లో రిజిస్టర్ చేశారు. మందులతో పాప ఆరోగ్యం కాపాడుతూ వచ్చారు. చెన్నె లోని ఎంజిఎం ఆసుపత్రిలో రెండేళ్ళ బాబుకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని, గుండె దానం చేస్తారనే విషయం ఆదివారం శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డికి తెలిసింది. ఎపి జీవన్దాన్ సంస్థ, చిన్నపిల్లల గుండె చికిత్సల నిపుణులు డాక్టర్ గణపతి బృందాన్ని ఆయన సమన్వయం చేసుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మాచర్ల లోని పాప తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో రాత్రి 10 గంటలకు వారు ఆసుపత్రికి చేరుకున్నారు.

 

 

 

Post Midle

రాత్రి 10-30 గంటలకు పాపకు అవసరమైన పరీక్షలు, కోవిడ్ పరీక్ష కూడా చేసి గుండె మార్పిడి చేయొచ్చని నిర్ధారించుకున్నారు. టీటీడీ సహకారంతో అంబులెన్స్, మరో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకుని వైద్య బృందం రాత్రికే చెన్నై చేరుకుంది. గ్రీన్ చానల్ అవసరం లేకుండా 2గంటల 15 నిముషాల్లో గుండెను తిరుపతి ఆసుపత్రికి తీసుకుని వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. నిముషం కూడా ఆలస్యం చేయకుండా తెల్లవారుజామున 3 గంటలకు గుండె ను తిరుపతి ఆసుపత్రికి తెచ్చారు. 45 నిముషాల్లో మెడికల్ ప్రొసీజర్స్ పూర్తి చేసి డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ గణపతి నేతృత్వంలోని వైద్య బృందం ఉదయం 4-30 గంటలకు గుండె మార్పిడి శస్త్ర చికిత్స ప్రారంభించి ఉదయం 9-30 గంటలకు విజయవంతంగా పూర్తి చేసింది. రూ 30 లక్షల ఖర్చయ్యే ఈ శస్త్ర చికిత్స టీటీడీ ప్రాణదానం, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శ్రీ పథకాల కింద పూర్తి ఉచితంగా చేశామని ఈవో తెలిపారు. మరో మూడు నాలుగు రోజులు పాపను ఐసీయూలో ఉంచి తరువాత వార్డుకు మారుస్తారని   ధర్మారెడ్డి చెప్పారు.

 

 

గుండె మార్పిడి శస్త్ర చికిత్సలకు అనుమతి లభించిన నెలరోజుల్లోనే రెండు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందం దేశంలోనే రికార్డు సృష్టించిందని ఈవో అభినందించారు. నెలరోజుల క్రితం గుండె మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం కె ఎస్ ఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన 15 సంవత్సరాల విశ్వేశ్వర్ సోమవారం డిశ్చార్జ్ అవుతున్నారని ఈవో తెలిపారు. పాప పూర్తి ఆరోగ్యవంతురాలై త్వరగా డిశ్చార్జ్ కావాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని అందరూ ప్రార్థించాలని కోరారు.ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఆసుపత్రి ప్రారంభించిన 15 నెలల్లోనే 1150 మంది చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చిన పిల్లలకు గుండె ఆపరేషన్లు చేశామన్నారు. ఆరోగ్యశ్రీ లేదా ప్రధానమంత్రి ఆరోగ్య భీమా కార్డు ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని వివరించారు. ఇలాంటి ఆసుపత్రి రాష్ట్రంలో శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె ఆసుపత్రి మాత్రమేనని ఆయన తెలిపారు.

 

 

 

జేఈవో   సదా భార్గవి, బర్డ్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి, వైద్య నిపుణులు డాక్టర్ గణపతి, డాక్టర్ సౌమ్య పాల్గొన్నారు.

జార్ఖండ్ బాబుకు శస్త్ర చికిత్స

జార్ఖండ్ రాజధాని రాంచి నివాసి శ్రీమతి లుక్సార్ పర్వీన్ మూడు నెలల కుమారుడికి వైద్య బృందం విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స నిర్వహించింది. వేలూరు లోని సి ఎం సి ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్ళిన పర్వీన్ కు అక్కడి వైద్యులు తిరుపతి లోని శ్రీపద్మావతి చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి కి వెళ్ళాలని సిఫారసు చేశారు. తన బాబును తిరుపతికి తీసుకుని వచ్చి అడ్మిట్ చేయడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి 15 రోజుల క్రితం శస్త్ర చికిత్స చేశారు. బాబు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడని శ్రీమతి పర్వీన్ సంతోషం వ్యక్తం చేశారు. తన బాబు ప్రాణాలు కాపాడిన టీటీడీ కి, వైద్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Tags: Shree Padmavati Little Children’s Hrudayalayam is a rare record

Post Midle