ధ్వజారోహణంతో వైభ‌వంగా శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుమల ముచ్చట్లు:

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం 8.15 నుండి 8.40 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది.అంతకుముందు శ్రీ గోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ట , రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ధ్వజారోహణం ఉద్దేశం.

 

 

అనంత‌రం ఉద‌యం 10.30 గంట‌లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఉత్స‌వ‌ర్ల‌కు వైభ‌వంగా స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు.సాయంత్రం 5.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్ సేవ‌, రాత్రి 7 గంట‌ల‌కు పెద్దశేష వాహ‌న సేవ జ‌రుగ‌నున్నాయి.ఈ కార్యక్రమంలో తిరుమ‌ల‌ శ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీ చిన్న జీయర్‌స్వామి, ఎఫ్ ఏ అండ్ సిఏఓ  బాలాజీ, సిఈ   నాగేశ్వరరావు, ఎస్ ఇ -2
జగదీశ్వర్ రెడ్డి, ఆగమ సలహాదారులు   సీతారామాచార్యులు,  మోహన రంగాచార్యులు, ఆలయ డెప్యూటీ ఈవో   శాంతి, కంకణభట్టార్‌  ఎ.నారాయణ దీక్షితులు, సూపరింటెండెంట్‌   మోహన రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌  ధనుంజయులు పాల్గొన్నారు.

Tags:Shri Govindarajaswamy Brahmotsavam begins with flag hoisting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *