ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరామ స్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుపతి ముచ్చట్లు:
టిటిడికి చెందిన ఒంటిమిట్టలోని పురాతన చారిత్రకప్రాశస్త్యం గల శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 నుండి 10.20 గంటల వరకు వృషభలగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. కంకణబట్టర్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జెఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా రాములవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఏప్రిల్ 3న హనుమంత వాహనం, ఏప్రిల్ 5న కల్యాణోత్సవం, ఏప్రిల్ 6న రథోత్సవం, ఏప్రిల్ 8న చక్రస్నానం జరుగుతాయన్నారు. కల్యాణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రివర్యులు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కల్యాణానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపడతామన్నారు.

కంకణబట్టర్ శ్రీ రాజేష్ కుమార్ మాట్లాడుతూ ముందుగా గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట, నేత్రోల్మీలనం నిర్వహించామన్నారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేసినట్టు చెప్పారు. రాగతాళ నివేదన ద్వారా ఇంద్రాది సకలదేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్టు తెలిపారు.ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు. అదేవిధంగా, ధృవ తాళం – సురటి రాగం, మధ్యతాళం – నాదనామక్రియా రాగం, భృంగిణి తాళం – లలిత రాగం, చంపక తాళం – భైరవి రాగం, ఏకతాళం – మలయమారుత రాగం, త్రిపుట తాళం – మేఘరంజని రాగం, రూపక తాళం – వసంతభైరవి రాగం, గంధర్వ తాళం – కింకర రాగం, నంది తాళం – శంకరాభరణం రాగం, గరుడ తాళం – ఆనందవర్ధన రాగం ఆలపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, శిక్షణ కలెక్టర్ రాహుల్ మీనా, ఆలయ డెప్యూటీ ఈఓ నటేష్ బాబు, సూపరింటెండెంట్లు పి.వెంకటేశయ్య, ఆర్సీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Tags; Shri Kodandarama Swami’s Sri Ramanavami Brahmotsavam begins with flag hoisting
