శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

Shri Padmavathi Ammavari Flowers of Love

Shri Padmavathi Ammavari Flowers of Love

Date:02/12/2019

తిరుపతి ముచ్చట్లు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం పుష్పయాగ మహోత్సవాన్ని టిటిడి సోమ‌వారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో నేత్ర పర్వంగా నిర్వహించింది.

వేడుకగా స్నపన తిరుమంజనం :

ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.00 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు. పుష్ప‌యాగం సందర్భంగా టిటిడి ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల కుసుమాలను అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో రెండు టన్నులు తమిళనాడు, ఒక టన్ను కర్ణాటక, ఒక టన్ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుండి దాతలు అందించారు.

వైభవంగా పుష్పాల ఊరేగింపు :

తొలుత మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఆస్థానమండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు, భక్తులు ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు. అనంతరం సాయంత్రం 5.00 నుంచి 8.00 గంటల వరకు శ్రీ కృష్ణముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వైదికులు వేదపారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి, సెంటు జాజులు, ప‌గ‌డ‌పు పూలు వంటి 14 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు. బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు డి.పి.అనంత్‌, ఆల‌య డెప్యూటీ ఈవో గోవింద‌రాజన్‌, గార్డెన్‌ డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు, ఏఈవో సుబ్రమణ్యం, గార్డెన్‌ మేనేజర్‌ జనార్ధన్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

 

ముఖ్యమంత్రి ఆశిస్తున్న సేవలు అందిస్తాం.

 

Tags:Shri Padmavathi Ammavari Flowers of Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *