అత్యంత వైభవంగా శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు- టీటీడీ ఈవో  ఎ వి ధర్మారెడ్డి

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు నగరంలో టిటిడి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు   వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో మంగళవారం నుంచి నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని టిటిడి ఈవో   ఏవి ధర్మారెడ్డి చెప్పారు.ఇక్కడి ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రారంభమైన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగరంలో వైభవోత్సవాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారని ఆయన చెప్పారు. శ్రీవారిని క్ష‌ణ‌కాల‌మైనా చూసి త‌రించాల‌ని అచంచ‌ల భ‌క్తి విశ్వాసాల‌తో ప్ర‌పంచం న‌లుమూలల నుంచి ప్ర‌తి రోజు వేలాది మంది భ‌క్తులు ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి తిరుమ‌ల‌కు త‌ర‌లివ‌స్తున్నారని చెప్పారు. వ‌చ్చిన భ‌క్తులంద‌రూ స్వామివారికి జ‌రిగే నిత్య, వారోత్స‌వాలు తిల‌కించ‌డం సాధ్యంకాదని, వ‌యోభారం, ఆర్థిక ప‌రిస్థితుల దృష్ట్యా అనేక మంది స్వామివారిని ఎక్కువ సార్లు చూసి త‌రించే అవ‌కాశం ఉండ‌దని అన్నారు. భ‌క్తుల‌కు ఈ బాధ లేకుండా చేయ‌డం కోసం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో నిర్వహించే నిత్య‌, వార సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టీటీడీ పలు ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహిస్తోందన్నారు.

 

 

కరోనా కారణంగా రెండున్నర ఏళ్ల విరామం తరువాత నెల్లూరు నగరం నుంచి ఈ ఉత్సవాలను టీటీడీ పునఃప్రారంభించిందన్నారు. నెల్లూరు జిల్లా వాసుల‌కు స్వామివారి సేవ‌లు చూసి త‌రించే భాగ్యం క‌ల్పించ‌డానికి ఎంపి  వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలు  వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌కు ముందుకు రావ‌డం సంతోషమన్నారు. స‌నాత‌న హిందూ ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా ముఖ్య‌మంత్రి   వై.ఎస్‌. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు అనేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న టీటీడీ రాబోవు రోజుల్లో శ్రీ‌వారి వైభ‌వోత్స‌వాల‌ను కూడా దాత‌ల స‌హ‌కారంతో అన్ని ముఖ్య‌మైన ప్రాంతాల్లో నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించిందన్నారు.అనంతరం స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవంలో ఈఓ   ధర్మారెడ్డి పాల్గొన్నారు.

 

Tags:Shri Venkateswara Vaibhavotsavalu in the most glorious manner – TTD EO AV Dharma Reddy

Leave A Reply

Your email address will not be published.