కొవ్వూరులో తమ్ముళ్ల తన్నులాటలు

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు నగరానికి చేరువలో ఉన్న నియోజకవర్గం కోవూరులో రాజకీయ చైతన్యం ఎక్కువే. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే ఇక్కడ టీడీపీ నేతల కదలికలు జోరందుకున్నాయి. గత ఎన్నికలలో ఓడిన పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మరోసారి బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నారు. 2019లో టికెట్‌ కోసం చివరి వరకు ప్రయత్నించి డీలా పడిన మరో టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి సైతం ఈసారి పోటీకి గట్టి పట్టుదలతో ఉన్నారట. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కూడా టీడీపీ టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇలా ఒక సీటు ముగ్గురు నేతల మధ్య పోటీ నెలకొనడంతో కేడర్‌లోనూ ఆ చీలిక వచ్చేసింది. అదే కోవూరు తెలుగు తమ్ముళ్లను టెన్షన్‌ పెడుతోందట.గత ఎన్నికల్లో ఓడిన తర్వాత పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి.. హైదరాబాద్‌లో స్థిరాస్థి వ్యాపారాలపై ఫోకస్‌ పెట్టారు. ఇటీవలే తరచూ కోవూరుకు వస్తున్నారు. 2004లో టీడీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు పోలంరెడ్డి. 2009లో ఓడిపోయారు. 2014లో టీడీపీలో చేరి అదే ప్రసన్నకుమార్‌రెడ్డిపై మళ్లీ గెలిచారు. 2019కి వచ్చే సరికి మళ్లీ సీన్‌ రివర్స్‌. ఇక్కడ పార్టీ నేతలతో పొసగక కోవూరుకు మూడేళ్లుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ.. 2024 ఎన్నికలే లక్ష్యంగా పోలంరెడ్డి గేర్‌ మార్చేశారు. ఇదే సమయంలో పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి కోవూరులో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.

 

 

Post Midle

గతంలో ఛాన్స్‌ మిస్‌ అయినా ఈ దఫా అలా జరగదనే గట్టి నమ్మకంతో ఉన్నారట. పైగా ఇటీవల నెల్లూరు వచ్చిన చంద్రబాబు ప్రత్యేకంగా పెళ్లకూరు ఇంటికి వెళ్లి సమావేశం అయ్యారు. పైగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మద్దతు కూడా పెళ్లకూరుకే ఉంది.టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి సైతం కోవూరుపై ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ ఆఫీసు ఏర్పాటు చేసి నేతలు.. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందరితో కాకుండా.. టీడీపీ కార్యక్రమాలను సొంతంగా చేపడుతున్నారు చేజర్ల. ప్రస్తుతం కోవూరులో పోలంరెడ్డికో టీడీపీ ఆఫీసు.. చేజర్లకు మరో టీడీపీ ఆఫీసు ఉన్నాయి. పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి మాత్రం నెల్లూరులో ఏర్పాటు చేసిన టీడీపీ ఆఫీసు నుంచి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇలా ముగ్గురు నేతలూ ఎవరికి వారుగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కేడర్‌ను గందరగోళంలోకి నెడుతోందట. ప్రస్తుతానికి తెరవెనక వేస్తున్న ఎత్తుగడలు.. రేపటి రోజున రోడ్డెక్కితే పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. మరి.. టీడీపీ పెద్దలు కోవూరులో ఎవరివైపు మొగ్గు చూపుతారో.. ఇంకెవరిని బుజ్జగిస్తారో చూడాలి.

 

Tags: Siblings’ kicks in Kovvur

Post Midle
Natyam ad