సిగ్నల్ సిత్రాలు

Date:16/02/2018
ఆదిలాబాద్ ముచ్చట్లు:
రేషన్ బియ్యం పంపిణీ అవకతవకల అరికట్టడం ఎలా ఉన్నా.. అసలు బియ్యం సరఫరాయే జరగని పరిస్థితి తలెత్తుతోంది. ఈ-పాస్ విధానం వల్లే ఈ దుస్థితి వచ్చిందని అంతా అంటున్నారు. బియ్యం పంపిణీ విధానాన్ని ఇంటర్నెట్‌కు అనుసంధానం చేయడంతో పలు ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సిగ్నల్స్ అందక యంత్రాలు మొరాయిస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు చౌకధరల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సిగ్నల్స్ అంది బియ్యం సరఫరా అయితే సరే. లేదంటే గంటల తరబడి వేచి ఉండి నిరాశగా వెనుదిరుగుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటోంది. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఈ-పాస్ విధానం మందకొడిగా సాగుతోంది. ప్రాంతీయంగా వందకుపైగా దుకాణాల్లో ఇంటర్నెట్ సమస్య ఉంది. ఈ దుకాణాల్లో పరిధిలో ఉన్న ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీలో సమస్యలు వస్తున్నాయి. జిల్లాలో చౌకధరల దుకాణాలు 355 ఉండగా రేషన్‌ కార్డులు 1,81,953 ఉన్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచే బియ్యం పంపిణీని ప్రారంభించినా పూర్తి స్థాయిలో జరగలేదు. ఇప్పటి వరకు కేవలం 1.17 లక్షల కుటుంబాలకు మాత్రమే పంపిణీ చేశారు. 50కి పైగా దుకాణాల్లో నెట్‌వర్క్స్‌ లేకపోవడంతో పంపిణీ ప్రారంభమే కాలేదు. కొన్ని గ్రామాల్లో కనీసం ఒక్క రోజు పదిమందికి కూడా పంపిణీ చేసే పరిస్థితి లేదు. మరికొన్ని గ్రామాల్లో ఇళ్లపైన ఎక్కి సరకులు ఇచ్చే పరిస్థితి దాపురించింది. అయినా ఇన్ని రోజులుగా సమస్య ఎదురవుతూనే ఉన్నా అధికారులు ఇటువైపు దృష్టి సారించడం లేదు. దీంతో లబ్ధిదారులు, రేషన్ డీలర్లలో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. ఈ సమస్యను గుర్తించిన అధికారులు సమస్య పరిష్కరిస్తామని చెప్తున్నారు. జిల్లాలోని రేషన్‌దారులకు ఇబ్బందులు లేకుండా చూస్తామి అన్నారు. ఇప్పటికే నెట్‌వర్క్‌ సమస్యలున్న ఎజెన్సీ గ్రామాల్లో సమస్యను పరిష్కరించేందుకు ఫీల్డ్‌ ఇంజినీర్లు ఆయా గ్రామాలను సందర్శిస్తున్నారని వెల్లడించారు. సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని వేలిముద్రలు పడని వృద్ధులకు ఆయా పంచాయతీలోని రెవెన్యూ సిబ్బంది సమక్షంలో అందజేసేలా చూస్తామని వివరించారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా బియ్యం పంపిణీ  సక్రమంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల వివరణ ఎలా ఉన్నా రేషన్ బియ్యం సకాలంలో అందకపోవడంతో బడుగులు నానాపాట్లు పడుతున్నారు.
Tags: Signal summaries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *