సిగ్నల్స్..సిత్రాలు..

Signalssitralu ..

Signalssitralu ..

DAte:11/08/2018
ఆదిలాబాద్
ఇప్పుడంతా సాంకేతికతదే హవా. పలు పనులు మొబైల్‌ ఫోన్లతోనే చక్కబెట్టేసుకుంటున్నారు ప్రజలు. సెల్‌ ఫోన్స్‌ లేనిదే కొన్ని కార్యకలాపాలు సాగవనేవారూ ఉన్నారు. మొత్తంగా దైనందిన జీవితంలో భాగమైన మొబైల్‌ఫోన్స్ ఆదిలాబాద్‌ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మొరాయిస్తున్న పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఫోన్లలో సమస్యలు కాదు. సిగ్నల్స్ తో చిక్కులు. ప్రధానంగా సిరికొండ ప్రాంతంలోని పలు గ్రామాల్లోని వారికి సిగ్నల్స్‌తో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆరు బయటకొచ్చి.. మేడలు, గోడలు ఎక్కినా సిగ్నల్స్ అందని పరిస్థితి ఉంటున్నట్లు స్థానికులు వాపోతున్నారు. ఫలితంగా అత్యవసర సమయాల్లో నానాపాట్లు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బీఎస్‌ఎన్ఎల్ సిగ్నల్ కూడా అందక తిప్పలు పడుతున్నట్లు చెప్తున్నారు. జిల్లాలో సుమారు 30 శాతం గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు ప్రజలు చేరువలో లేనట్లు విమర్శలున్నాయి. ఒకవేళ ఉన్నా అంతంత మాత్రమే అని స్థానికులు అంటున్నారు.  దాదాపుగా జిల్లాలోని 100కు పైగా గ్రామాల్లో కనీస సేవలు అందని పరిస్థితి ఉందని వివరిస్తున్నారు. ప్రస్తుతం మొబైల్‌ఫోన్ లేని ఇల్లు లేదు. ఇలాంటి రోజుల్లో సంబంధిత అధికారులు సిగ్నల్ అందించే సేవలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర సమయాల్లో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతమని అంతా అంటున్నారు.  ఈ రోజుల్లో  ఏ పని జరగాలన్నా సెల్‌ఫోన్ ఉండాల్సిందే. ఇలాంటి పరిస్థితిలోనూ కనీస సంకేతాలు అందకపోవడంతో పల్లె వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంధుమిత్రులకు సంబంధించి ఏదైనా మంచీచెడు సమాచారం, కార్యాలయాల విషయాలు తెలుసుకోవాలన్నా మొబైల్‌ఫోనే ఆధారమైంది ప్రస్తుతం. ఇక అత్యవసర పరిస్థితుల్లో 108కు మాట్లాడాలన్నా, ఉపాధి, పింఛన్‌ డబ్బులు తీసుకోవాలన్నా సెల్‌ఫోన్ అవసరం ఎక్కువగానే ఉంటోంది. అయితే సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఎక్కడైనా ఇళ్లపై, గుట్ట ప్రాంతాలకు వెళ్తే తక్కువగా వచ్చే సంకేతాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. సిరికొండ పరిసర గ్రామాలకు వెళ్తే బాహ్యప్రపంచాన్ని మర్చిపోవాల్సిందేనని పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో దాదాపుగా 60 శాతం గ్రామాల్లోనూ బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు సక్రమంగా ఉండడం లేదని వాపోతున్నారు. టవర్లు ఉన్నా  సంకేతాల లోపం ఉండడంతో చాలా మంది వినియోగ దారులు తమ సిమ్‌లను ఇతర కంపెనీలకు మార్చుకుంటున్నారని చెప్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను వినియోగించుకునే వారు తగ్గిపోతారని హెచ్చరిస్తున్నారు. ప్రధాన మండల కేంద్రాలు మినహ మిగిలిన ప్రాంతాల్లో సిగ్నల్స్ సమస్య వేధిస్తోందని వివరిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడంలేదని అంటున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి సిగ్నల్స్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
Tags:Signalssitralu ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *