పంచాయతీ ఎన్నికల్లో గుర్తుల గుబులు

Date:11/01/2019
నల్లగొండ ముచ్చట్లు:
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటములను తారుమారు చేసిన ‘ట్రక్కు’ గుర్తును అభ్యర్థులు ఇంకా మర్చిపోకముందే.. పంచాయతీ ఎన్నికల్లో కేటాయించిన గుర్తులు ప్రస్తుతం గుబులు పుట్టిస్తున్నాయి. పల్లెపోరులో స్వల్ప ఓట్ల ఆధిక్యతతో గెలుపొందే సర్పంచ్, వార్డు అభ్యర్థులకు బ్యాలెట్‌లో ఊరూ పేరు, ఫోటో లేకుండానే బ్యాలెట్‌లో దర్శనమిచ్చే గుర్తులు ఓటర్లను మరోసారి తికమక పెట్టే అవకాశం ఉన్నాయి. గ్రామీణులు సులువుగా అర్థం చేసుకునే గుర్తులు ఈ ఎన్నికల్లో బాగానే ఉన్నా.. షటిల్‌కాక్ గుర్తుపై పల్లెజనం, తాండాలు, గూడేల్లో ఇప్పటికీ చూసిన ఓటర్లు బహుతక్కువే. సర్పంచ్ బ్యాలెట్‌పై ఏడో స్థానంలో ఉన్న షటిల్‌కాక్ గుర్తును ప్రచారం చేయడం అభ్యర్థులకు క్లిష్టంగా మారుతుండగా వృద్ధులకు, నిరక్షరాస్యులకు ఏవిధంగా అర్థమయ్యేలా చెప్పాలో అభ్యర్థులకు అంతుపట్టడం లేదు.
ఓటువేసేందుకు వెళ్ళేవారు షటిల్‌కాక్‌ను ఏలా గుర్తు పడతారన్నది సందేహస్పదంగా మారింది. దీంతో ఒకరికి పడాల్సిన ఓట్లు మరొకరికి పడే అవకాశం కూడా లేకపోలేదు. ఇక వార్డు సభ్యుల ఎన్నికల్లో ఉపయోగించే బ్యాలెట్‌లో గుర్తులు అయోమయానికి గురిచేసేలా ఉన్నాయి. మూడో స్థానంలో గ్యాస్ స్టవ్ ఉండగా అయిదవ స్థానంలో సిలిండర్ ఉంది. సాధారణంగా గ్రామాల్లో రెండింటిని కలిపి సిలిండర్‌గా పిలువడం సహజమే. పాత తరం వారికి, పెద్దగా అవగాహన లేనివారికి, కట్టెలపొయ్యిని వినియోగించే ఓటర్లు సైతం గ్యాస్ స్టవ్, సిలిండర్లను సరిగ్గా గుర్తుపట్టి ఓటువేయడం క్లిష్టమైన సమస్యగా భావిస్తున్నారు.
నా గుర్తు సిలిండర్ అని ప్రచారం చేస్తే కొందరు ఓటర్లు తికమక పడి స్టవ్‌కు ఓటువేసే అవకాశాలు లేకపోలేదు. దీంతో అభ్యర్థుల తలరాతలే మారే అవకాశం ఉంది. ఇందుకు కారణం పంచాయతీ ఎన్నికల బ్యాలెట్‌లో అభ్యర్థి పేరు, ఊరు ఉండకపోగా కేవలం గుర్తులు మాత్రమే ఉండడంతో వీటిని ఫలాన అభ్యర్థి గుర్తు అని గుర్తుంచుకొని ఓటువేయాల్సి ఉంటుందినూతన పంచయాతీరాజ్ చట్టంలో భాగంగా 500 జనాభా ఉన్న తాండాలు, గూడేలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయగా పలుపల్లెల్లో నిరక్షరాస్యత అధికంగా ఉన్న నేపథ్యంలో ఓటర్లు ఒకేలా ఉన్న గుర్తులతో ఇబ్బందులు పడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చూడ్డానికి దగ్గర పోలికలు ఉన్న గుర్తులు కొన్ని అభ్యర్థులకు తంటాలు తెచ్చిపెట్టే విధంగా ఉండగా మరికొన్ని ఫలాన అభ్యర్థి గుర్తు అని ప్రచారం చేయడానికి అభ్యర్థులు సైతం తికమకపడాల్సి వస్తోంది. సర్పంచ్ ఎన్నికల బ్యాలెట్‌లో మూడోస్థానంలో ఉన్న క్రికెట్ బ్యాట్, అయిదవ స్థానంలో ఉన్న ఏరోప్లేన్ గుర్తులు రెండుకాస్త దగ్గరి పోలికలతో బ్యాలెట్‌లో ముద్రించి ఉండడంతో అవగాహన లేని వృద్ధులు, నిరక్షరాస్యులైన ఓటర్లు, అంతంతమాత్రంగానే కంటిచూపు కలిగి ఉన్న వృద్ధులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది.
తికమక గుర్తులతో ఎవరి కొంపలు మునుగుతాయోనన్న భయం అభ్యర్థులను పట్టిపీడిస్తోంది.పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’ గుర్తు బ్యాలెట్ చివరణ ముద్రించి ఉండడంతో ఓటర్లు ఇక్కడ కూడా తికమకపడాల్సి వస్తోంది. పల్లెల్లో పోటీచేసే అభ్యర్థులు తక్కువ మందే ఉండడంతో వారికి కేటాయించిన గుర్తుల కిందనే నోటా గుర్తు ముద్రించి ఉండడంతో ఆ గుర్తుపైన పడే ఓటు తెలువకుండానే ఓటు ముద్ర నోటాపై పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Tags: Signs of Panels in Panchayat Elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *