సకుటుంబ సమేతంగా జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి

Single festival celebration

Single festival celebration

Date:12/01/2019
చిత్తూరు ముచ్చట్లు:
గ్రామాల్లో రైతులు సంతోషంగా, సకుటుంబ సమేతంగా జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి. తెలుగు సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ, ఊరూవాడా ఏకమై సంబరాలు జరుపుకుంటుంటారు. సంక్రాంతి సందర్భంగా తమిళనాడు లో జరుపుకునే జల్లికట్టు సంప్రదాయాన్ని చిత్తూరు జిల్లాలోకి కొన్ని గ్రామాల వారు కూడా పాటిస్తారు. జల్లికట్టు సంక్రాంతి సమయంలో సరదాగా ఆడే క్రీడ. కానీ ఆ క్రీడలో రక్తమోడాల్సిందే. మనుషులకు, పశువులకు తీవ్రగాయాలు కావాల్సిందే.. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. అయినా.. ఆ క్రీడను ప్రతిఏటా ఆడాల్సిందే. ఇదే జల్లికట్టుకు వున్న ప్రత్యేకత. పశువుల పండుగ పేరుతో ఆడే ఈ సాహస క్రీడకు చిత్తూరు జిల్లా రంగంపేట మళ్లీ సిద్ధమైంది. చిత్తూరు జిల్లాలో తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయన్ని రైతులు పవిత్రంగా భావిస్తుంటారు.
సంక్రాంతి పండుగ సందర్బంగా జరిగే జల్లికట్టుకు వున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. జల్లికట్టును తమిళనాడు, కర్ణాటకలో విశేష ఆదరణ ఉంది. ఈ సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్ లో  కేవలం చిత్తూరు జిల్లాలో మాత్రమే పాటిస్తారు. జల్లికట్టును ఎద్దుల పండుగ అని కూడా అంటారు. ఏడాదికి ఒక్కసారి వచ్చె  ఈ పండుగను అత్యంత భక్తిబావంతో జరుపుకొంటారు. గోవులను పూజించిన తర్వాత సంబరాలు చేసుకొంటారు. ఎవరు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంబరాలు మాత్రం ప్రతి ఏటా కొనసాగుతూనే వున్నాయి. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరుడు మట్టి పుట్టలో వున్నప్పుడు గోమాత పాలిచ్చినందున ఈ ప్రాంతవాసులు గోవులను దైవంతో సమానంగా భావిస్తారు. వెంకటేశ్వర స్వామికి గోవులకు అవినాభావ సంబంధం వున్నందునే తాము సంక్రాంత సందర్బంగా ఆవులను పూజించి పండుగ చేసుకొంటామని చెప్తారు ఈ ప్రాంతవాసులు.
సంక్రాంతి పండుగ మొత్తం నాలుగు రోజులైతే కనుమరోజు ఆవులను గుంపులు గుంపులుగా వీదుల్లో వదులు తారు. ఒకప్పుడు సాంప్రదాయంగా మొదలైన ఈ పశువుల పండుగ.. నేడు ఓ క్రీడగా మారింది.
కనుమనాడు గిత్తలను అందంగా అలంకరించి మద్యం తాగిస్తారు. డప్పులు, బాణాసంచాలతో వాటిని అదిరించి పరుగులు పెట్టిస్తారు. పశువులు భయంతో పరుగులు తీస్తుంటే. వాటిని పట్టుకునేందుకు కొందరు అడ్డంపడతారు. తమ ధీరత్వాన్ని ప్రదర్శించేందుకు పోటీపడతారు. చిత్తూరు జిల్లాలోని జల్లికట్టును చూసేందుకు జిల్లా నలుమూలలు నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచీ ఔత్సాహికులు  పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. పశువులను పట్టుకోవడంలో చూపించే దమ్ము, ధైర్యాన్ని ప్రత్యక్షంగా చూస్తేనే మాంచి కిక్ ఉంటుందని స్థానికులు అంటారు.
జల్లికట్టు ధైర్యసాహసాలతో కూడిన క్రీడ. గుంపుగా వచ్చే పశువుల మందలొ పలకలను కలిగిని ఎద్దులను పట్టు కోవడానికి యువకులు పొటీపడతారు. పశువుల కొమ్ములకు ఉండే చెక్కలను పట్టుకున్నవారు గెలిచినట్లు లెక్క. గ్రామాల్లోని ప్రధాన వీధిలో ఇరువైపులా జనం నిలబడతారు. వారి మధ్యలో పశువులను వదులుతారు. అలా జనం మధ్యంలో వచ్చే కోడె గిత్తలు రెచ్చి పోయి జనం మీదికి దూసుకు వస్తుంటాయి. పశువులను పట్టుకునే క్రమంలో గాయపడినా కొందరు వెనక్కితగ్గరు. గాయాలతో రక్తమోడుతున్నా వాటిని పట్టుకోవడానికే ప్రయత్నిస్తారు.
జల్లికట్టు క్రీడలో పాల్గొనడం అంటే ప్రాణాలతో చెలగాటమే. మనుషులే కాదు మూగజీవాలూ తీవ్రంగా గాయపడతాయి. వాటిని ఇంతగా హింసించడం తగదని ఇలాంటి క్రీడలకు స్వస్తి పలకాలని డిమాండ్లు, విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. కానీ సంక్రాంతి వచ్చిందంటే మాత్రం ఈ క్రీడను సంప్రదాయంగా భావించే ఊళ్లు సందడిగా మారిపోతాయి. జల్లికట్టులో పాల్గొనేందుకు కొందరు ఉవ్విళ్లూరితే.. ఈ సాహసక్రీడ ప్రత్యక్షంగా తిలకించాలని అంతా ఆసక్తి చూపిస్తుంటారు. జల్లికట్టు తమిళనాడులో 400 ఏళ్ల నుంచి ప్రాచుర్యంలోకి ఉంది. నాటి నుంచి నేటివరకు జల్లికట్టుకు ఉన్న ఆదరణ ఏమాత్రం చెక్కు చెదరలేదు.
Tags:Single festival celebration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *