స్మార్ట్ సిటీ ఊసేదీ..? (కరీంనగర్)

Date:08/10/2018
కరీంనగర్  ముచ్చట్లు:
స్మార్ట్ సిటీ కల ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. నగరాన్ని స్మార్ట్ మార్చేందుకు కేంద్రం అనుమిచ్చి నిధులు కేటాయించినా.. పనులు మాత్రం మొదలవడం లేదు. స్మార్ట్ సిటీ పనులపై ప్రకటనలు తప్ప ఎక్కడా వాటి  జాడ కనిపించడం లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు టెండర్ల ఖరారే కాకపోవడంతో ఆ పనులను ప్రారంభించేది ఎప్పుడు..? పూర్తి చేసేది ఎప్పుడు అనే ప్రశ్నలు నగరవాసుల నుంచి వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పరిధిలో నగరాన్ని అందంగా తీర్చిదిదిద్దడం.. రూపురేఖలు మార్చేందుకు స్మార్ట్‌ సిటీ కింద పనులను ప్రతిపాదించారు. మొదటి ప్రాధాన్యత కింద చేపట్టే పనులపై అధికారులు, కన్సల్టెన్సీ బృందంతో పలుమార్లు ఉన్నతస్థాయిలో చర్చ చేపట్టారు.
పరిపాలన, సాంకేతిక అనుమతులు పొందారు. స్మార్ట్‌ సిటీ పనులు మూడు దశల్లో చేపట్టాలని నిర్ణయించారు. ప్యాకేజీల వారీగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా మొదటి ప్యాకేజీలో నగరంలో స్మార్ట్‌ రోడ్లుగా ఆధునికీకరణ చేయనున్నారు. ఆకర్షణీయంగా ఎంపిక చేసిన డివిజన్‌లలో నగరాన్ని అందంగా మార్చనున్నారు. రోడ్లు, మురుగు కాల్వలు, సైకిల్‌ ట్రాక్, వాకింగ్ ట్రాక్, డివైడర్లు, మొక్కల పెంపకం వంటివి ఇందులో చేపట్టనున్నారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు తీసుకొని టెండర్లు సైతం ఆహ్వానించారు.
నగరంలో చేపట్టే స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనులకు జూలై 3న టెండర్‌ ప్రకటన జారీ చేశారు.
మొత్తం ఐదు పనులకు రూ.228.70 కోట్లతో నిర్వహించిన టెండర్‌లలో.. మూడు ప్యాకేజీలకు సంబంధించిన రోడ్ల నిర్మాణ పనులు, రూ.3.80 కోట్లతో సర్కస్‌ మైదానం అభివృద్ధి చేసేందుకు, రూ.7.20 కోట్లతో మల్టీ పర్పస్‌ పాఠశాల ఆవరణలో పార్కు నిర్మాణం పనులకు ఆహ్వానించారు. వీటికి సంబంధించిన టెండర్లను ఆగస్టు 8న టెక్నికల్‌ బిట్‌ తెరిచి వదిలేసిన అధికారులు.. గత నెల 28న కాంట్రాక్టర్లు ఎవరెవరు అర్హత సాధించారో అనే విషయాలను తేల్చారు. అంటే 52 రోజుల సమయాన్ని అధికారులు తీసుకున్నారు.
నగరంలో స్మార్ట్‌ సిటీ కింద రోడ్ల పనులకు మూడు ప్యాకేజీల కింద రూ.217.70 కోట్లతో టెండర్లు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం మూడు ప్యాకేజీలకు 12 మంది పోటీ పడగా అందులో నలుగురు గుత్తేదారులు అర్హత సాధించారు. మొదటి ప్యాకేజీ కింద 13 కి.మీ రోడ్డు పనులు ఉండగా ఇద్దరు, రెండో ప్యాకేజీ కింద 14.5 కి.మీ పరిధిలో ముగ్గురు, మూడో ప్యాకేజీలో ఏడుగురు పోటీ పడ్డారు.  స్మార్ట్‌ సిటీ టెండర్లను నిర్వహించిన అధికారులు ఆ టెండర్ల ఖరారు విషయంలో తీవ్రమైన జాప్యం చేస్తున్నారు. ఉన్నత స్థాయిలో నిర్వహిస్తున్న టెండర్లను కమిటీ ఛైర్మన్‌ ప్రజారోగ్యశాఖ చీఫ్‌ ఇంజినీర్, సభ్యులు కలిసి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు పనులు చేయడానికి అనుమతులు ఇస్తారు. అయితే సాంకేతికపరమైన అనుమతులు తీసుకోవడంలో ఆలస్యం చేసిన అధికారులు.. ఈ కమిటీ అనుమతులు ఎప్పటిలోగా ఇస్తుందో తెలియకుండా మారింది.
Tags:Smart City (Karimnagar)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *