Natyam ad

కంపుకొడుతున్న బస్తీలు

తిరుపతి ముచ్చట్లు:

స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో స్వచ్ఛతే కరువైంది. బస్తీల్లో ఎటు చూస్తే అటు పేరుకుపోయిన చెత్త కుప్పలు. ముక్కుపుటాలు అదిరిపోయే దుర్గంధం, చెత్త కుండీలు నిండిపోయి రోడ్డుపై చెల్లా చెదురుగా పడి ఉన్న చెతను పందులు, వీధికుక్కలు మరింత చిందరవందర చేస్తుండడంతో ఆ దారిలో వెళ్లాలంటేనే భయమేస్తోంది. దోమల బెడద సరేసరి. ఇది రాష్ట్రంలో ఎక్కడో ఉన్న బస్తీల సంగతి కాదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి నివాసానికి కూత వేటు దూరంలో ఉండే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల పరిస్థితి. ఇక్కడే ఇటువంటి పరిస్థితి ఉంటే, రాష్ట్రంలో మిగతా ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. . ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అంటు వ్యాధులు విజృంభించి రాష్ట్రం రోగాంధ్రప్రదేశ్‌గా మారే ప్రమాదముందని, కరోనా మళ్లీ తలెత్తుతున్న స్థితిలో ఇది విపత్కర పరిణామాలకు దారి తీసే ప్రమాదముందని ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబరు26 నుంచి మున్సిపల్‌ వర్కర్స్‌ చేస్తున్న సమ్మెను పరిష్కరించి ఉంటే ఈ పరిస్థితి వచ్కేది కాదు. అందునా సంక్రాంతి పండగ దగ్గర పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం బెట్టు వీడి సమ్మెను పరిష్కరిస్తే మంచిదని మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కోరుతున్నారు. 14  రోజులుగా మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేస్తున్నా వారి ప్రధానమైన డిమాండ్లను అంగీకరించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది. సమ్మెను విఫలం చేసేందుకు పోటీ కార్మికులు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను రంగంలోకి దింపాలని చూసింది. పోటీ కార్మికులు కూడా సమ్మెకు దిగారు. టన్నులకొలది పోగుపడుతున్న చెత్త ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు దర్పణం పడుతున్నాయి.గ్రేటర్‌ విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) పరిధిలో ప్రతి రోజూ 845 మెట్రిక్‌ టన్నుల చెత్త పొగవుతోంది. సమ్మె ప్రారంభమైన నాటి నుంచి దాదాపు 2,500 టన్నులు చెత్త పోగయింది. దీనిలో 1,200 టన్నుల చెత్తను మాత్రమే అధికారులు తొలగించగలిగారు. జివిఎంసి పరిధిలో 990 మంది పర్మినెంట్‌, 4,900 అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు ఉన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులందరూ సమ్మెలో ఉన్నారు. పర్మినెంట్‌ కార్మికులతో అధికారులు చెత్తను తీయిస్తున్నారు.గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలో ప్రతి రోజూ 800 మెట్రిక్‌ టన్నుల చెత్త పోగవుతుంది. 300 మంది పర్మినెంట్‌ కార్మికులు ఉన్నారు. ప్రస్తుతం 110 నుంచి 150 మెట్రిక్‌ టన్నుల చెత్త మాత్రమే సేకరణ జరుగుతోంది. అనంతపురం కార్పొరేషన్‌ పరిధిలో ప్రతి రోజూ 120 మెట్రిక్‌ టన్నుల చెత్త పోగవుతోంది. పర్మినెంట్‌ కార్మికుల ద్వారా ప్రసుత్తం 25 మెట్రిక్‌ టన్నుల చెత్త మాత్రమే సేకరణ జరుగుతోందివిజయనగరంలో 480 మంది కార్మికులు సమ్మెలో ఉండటంతో ఎక్కడి చెత్త అక్కడే పొగుపడుతోంది. మరోవైపు కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో మురికి నీరు ప్రధాన వీధుల్లోకి ప్రవహిస్తున్నాయి. నగరంలోని 50 డివిజన్లలో ఇదే పరిస్థితి నెలకొంది.ఒంగోలు నగరంలో ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం మూడు, నాలుగు రోజులకోసారి జరుగుతోంది. మిగతా మున్సిపాలిటీల్లోనూ కాలనీల్లో, బ్లాక్‌ పాయింట్ల వద్ద చెత్త కుప్పలుకుప్పలుగా పేరుకుపోయింది. డ్రెయినేజీ శుభ్రత పూర్తిగా నిలిచిపోయింది. దోమల ఉధృతి పెరిగింది. ఇళ్లల్లో చెత్త సేకరణ నిలిచిపోవడంతో ప్రజలు కూడా మున్సిపల్‌ కార్మికుల సమ్మె గురించి చర్చించుకుంటున్నారు. కార్మికులు ఎప్పుడు విధుల్లోకి వస్తారని వాకబు చేస్తున్నారు.శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ కెటి రోడ్డుతో పాటు వార్డుల్లో చెత్తా పేరుకుపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తడి చెత్తా, పొడి చెత్తా ఒకే ప్రాంతంలో పారవేయడంతో దుర్వాసన భరించలేక పోతున్నామని పట్టణ ప్రజలు, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్ఛాపురంలో రెగ్యులర్‌ ఉద్యోగులతో అరకొర పారిశుద్ధ్య పనులు పడుతున్నా కాలనీల్లో చెత్త కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. అనంతపురం నగర పాలక సంస్థతోపాటు ఆరు మున్సిపాలిటీలు ఐదు నగర పంచాయతీల్లోని ప్రతి వీధుల్లోనూ చెత్త పేరుకుపోయింది. ఇంజనీరింగ్‌ కార్మికులు కూడా జిల్లాలో సమ్మెలో ఉండటంతో ప్రధాన వీధుల్లో తప్ప తక్కిన చోట్ల రాత్రి సమయాల్లో వీధి లైట్లు కూడా వెలగడం లేదు.ఏలూరు కార్పొరేషన్‌లో ఏ వీధి చూసినా చెత్తతో నిండిపోయింది. ప్రతి ఇంటివద్ద చెత్తడబ్బలు నిండిపోయాయి. రహదారులపైనే చెత్త పడేస్తున్నారు. విశాఖ నగరంలోని పూర్ణామార్కెట్‌, జగదాంబ, ఎంవిపి.కాలనీ, కెఆర్‌ఎం.కాలనీ, జాలారిపేట, గాజువాక, మధురవాడ, మల్కాపురం, కంచరపాలెం, గోపాలపట్నం వంటి ప్రాంతాల్లో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం అక్కడక్కడా ప్రయివేటు వ్యక్తులను పెట్టి చెత్త తరలింపు పనులు చేయిస్తున్నా నగరం మొత్తం కంపుకొడుతోంది.తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కార్మికుల సమ్మెతో డ్రెయిన్లలో సిల్టును తీసేవారు కరువయ్యారు. మరో రెండు రోజులు ఇలాగే ఉంటే వీధుల్లోకి మురుగునీరు ప్రవహించే ప్రమాదం ఉంది. కాకినాడ జిల్లా సామర్లకోట, పెద్దాపురంలో కార్మికుల సమ్మెతో పారిశుధ్యం పనులు చాలా వరకూ నిలిచిపోయాయి. మెయిన్‌ రోడ్డులను మాత్రం పర్మినెంట్‌ కార్మికులు శుభ్రం చేస్తున్నారు. వార్డుల్లోకి శానిటేషన్‌ సిబ్బంది రాకపోవడంతో చెత్తకుండీలు నిండిపోయాయి.తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ కంపు కొడుతోంది. చెత్తను తొలగిస్తున్నట్లు మున్సిపల్‌ కౌన్సిలర్స్‌ ఫొటోకు ఫోజులివ్వడమే తప్ప కార్మికుల సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదు. అధికార మెప్పుకోసం పోటీ కార్మికులతో పనులు చేయిస్తూ..అడ్డుకుంటున్న వారిపై బైండోవర్‌ కేసులు పెడుతున్నారు. ఉమ్మడి కడప, కర్నూలు, కృష్ణాలోని ప్రధాన పట్టణాలు చెత్తతో పేరుకుపోయాయి. వీథులన్నీ దుర్వాసనలు వెదజల్లుతున్నాయి.

 

Post Midle

Tags: Smelly slums

Post Midle