Natyam ad

పెట్రోలియం  వర్శిటీకి చకచకా అడుగులు

విశాఖపట్టణం ముచ్చట్లు:

విశాఖపట్నం సమీపంలో సబ్బవరం వద్ద ఏర్పాటవుతున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) పనులకు ఆటంకం కలిగించడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్పష్టం చేసింది. జాతీయ ప్రాముఖ్యత దృష్ట్యా ఈ సంస్థ నిర్మాణాన్ని ఆపడం సాధ్యం కాదని తెలిపింది. ఈ సంస్థ ఏర్పాటు కోసం సేకరించిన భూమికి ప్రభుత్వం ఎకరానికి అందించే రూ.13 లక్షల పరిహారం చాలదంటూ 29 మంది పిటిషనర్లు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఆరేళ్లుగా కోర్టులో వివాదం నడుస్తోంది. ప్రభుత్వం చెల్లించే పరిహారంతో పిటిషనర్లు నష్టపోతున్నారంటూ వారి తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని కోరింది. మరోవైపు భూములు ఇచ్చిన డీ–పట్టాదారులకు అదనంగా ఎకారానికి రూ.5.50 లక్షలు చెల్లించాలని, ఈ మొత్తాన్ని రెండు వారాల్లోగా కోర్టులో డిపాజిటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు  మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద వీరిలో తొమ్మిది మందిని విచారించి నష్టపరిహారానికి అర్హులో కాదో గుర్తించి కోర్టుకు 45 రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఐఐపీఈ పనులకు పిటిషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అవాంతరాలు సృష్టించరాదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

 

ఐఐపీఈ విశాఖలో 2016లో ఏర్పాటైంది. ఇది ఐఐటీ, ఐఐఎంలతో సమాన స్థాయి కలిగి ఉంటోంది. పెట్రోలియం, కెమికల్‌ ఇంజినీరింగ్‌ల్లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తోంది. ఐఐపీఈ హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, ఓఎన్‌జీసీ, గెయిల్, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్, బీపీసీఎల్‌తో పాటు ఐఐటీ ఖరగ్‌పూర్‌తో మెంటార్‌షిప్‌ను కలిగి ఉంది. పెట్రో యూనివర్సిటీ నిర్మాణం పూర్తయితే సుమారు 1200 మంది విద్యార్థులు బీటెక్‌లో పెట్రోలియం, కెమికల్‌ కోర్సులు అభ్యసించే వీలుంటుంది. అంతేకాదు.. వీటితో పాటు ఎమ్మెస్సీ, ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులు చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఏయూ ప్రాంగణంలో పెట్రో వర్సిటీ కోర్సులు నిర్వహిస్తున్నారు. సబ్బవరం మండలం వంగలి సమీపంలో ఈ సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం 201.8 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందుకోసం మొత్తం రూ.1050 కోట్లకు గాను రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కేంద్ర ప్రభుత్వం రూ.350 కోట్ల నిధులను మంజూరు చేసింది. కేటాయించిన స్థలంలో కొన్నాళ్లుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంతలో 26 ఎకరాలకు సంబంధించిన రైతులు పరిహారంపై కోర్టునాశ్రయించారు. ఈ నేపథ్యంలో ఐఐపీఈ నిర్మాణ పనులకు ఆటంకం కలిగించవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వడంతో ఇన్నాళ్లూ దీనికి ఉన్న అడ్డంకులు తొలగినట్టయింది. దీంతో ముందుగా అనుకున్నట్టు 2024–25 నాటికి ఈ వర్సిటీ నిర్మాణం పూర్తి చేసి తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది.

 

 

Post Midle

Tags: Smooth steps to Petroleum Varsity

Post Midle

Leave A Reply

Your email address will not be published.