గజ్వేల్ లో ఒక్కటవుతున్న సామాజిక వర్గాలు

Date:10/11/2018
మెదక్ ముచ్చట్లు:
గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపునకు రెడ్డీలంగా ఏకమయ్యారా? తమ వర్గం పవర్ చూపించేందుకు కాపు సామాజిక వర్గమంతా ఏకతాటిపైకి వచ్చారా? వంటేరు ప్రతాప్‌రెడ్డికి తమ మద్దతును ప్రకటిస్తూ గెలుపు కోసం ఆర్థిక సాయానికి సైతం ముందుకు వచ్చారా? అంటే తాజా పరిస్థితులు నిజమనే  చెబుతున్నాయి.  గజ్వేల్ బరిలో ప్రతాప్‌రెడ్డి గెలుపు సాధించాలనే ఏకైక లక్ష్యంతో రెడ్డి సామాజిక వర్గం ముందుకు సాగుతున్నట్టు సమాచారం.
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ సారి శాసనసభ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. ఎవరికి వారే ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు అభ్యర్థుల గెలుపునకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గం ఏకతాటిపైకి రావడం, ప్రతాప్‌రెడ్డికి తమ మద్దతును ప్రకటించడం ఓ ‘బహిరంగ రహస్యమే’.
కేసీఆర్ పాలనలో తమ సామాజిక వర్గం ప్రాధాన్యత పూర్తిగా దెబ్బతిందనే ఆలోచనలో ఈరకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే రెందు దఫాలుగా ఓడిపోవడం, అయినా నిరంతరం ప్రజల్లో ఊంటూ కష్టనష్టాలకు ఎదురీదుతుంటంతో భావోద్వేగానికి గురైన రెడ్ల సామాజిక వర్గం ఓ దశలో ప్రతాప్‌ను గెలిపించుకోవడం తమ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా తీసుకోవడం గమనించాల్సిన విషయమే. ప్రతాప్ గెలుపుకోసం ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన ప్రణాళికను రూపొందించినట్లు వినికిడి.
గ్రామీణ స్థాయిలో ఉన్న రెడ్లను సైతం ప్రతాప్‌కు అంతర్గతంగా విజయానికి సహకరించాల్సిందిగా అల్టిమేటం జారీ చేసినట్లుగా తెలియవస్తోంది. ఇప్పటికే రెండు దఫాలుగా కొంతమంది రాష్ట్ర, నియోజకవర్గ స్థాయి రెడ్డి సామాజిక వర్గం నేతలతో శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌లో రహస్య సమావేశం నిర్వహించి సమాలోచనలు చేసినట్లు ఆ సామాజికవర్గం నేతలే చెప్పుకోవడం గమనించాల్సిన అంశం.
పార్టీలకతీతంగా వంటేరుకు సంపూర్ణంగా తమ మద్దతు ప్రకటించాలని కాపు పెద్దలు సూచించినట్లు వినికిడి. అయితే టీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న వంటేరు సానుభూ తిపరులు కూడా కాంగ్రెస్ నేతకే మద్దతిచ్చేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం, ఇటీవల వలసలు వచ్చినవారికి కూడా పెద్దపీటవేసి ఉద్యమకారులను విస్మరించడం కూడా ఇందుకు ఓ ప్రధాన కారణంలా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి కేసీయార్ తమ పార్టీ పాక్షిక మేనిఫెస్టోలో రెడ్డిలను ఆకర్శించే క్రమంలోనే రెడ్డి కార్పొరేషన్ ప్రకటించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇలాంటివలలో ఏమాత్రం కూడా పడొద్దనే వాదనను తమ సామాజికవర్గంలో బలంగా విని పిస్తున్నారు.  నర్సారెడ్డి ఇటీవలే టీఆర్‌ఎస్‌ను వీడటం, ప్రతాప్‌తో జత కట్టడంలాంటి అంశాలు రెడ్డి పెద్దలు కారణంగానే జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో కార్పొరేషన్ ఛైర్మెన్ సైతం తనవంతు మద్దతు ప్రతాప్‌కు ఖచ్చితంగా ఉంటుందని గట్టిగానే హామీ ఇచ్చినట్లు సమాచారం.
అయితే తాను అధికార పార్టీలో కొనసాగుతున్న ప్రస్తుత క్రమంలో బహిరంగ ప్రచారం చేయనని, అంతర్గతంగా పావులు కదుపుతూ కాంగ్రెస్ పార్టీకి పెద్దమొత్తంలో ఓట్లు పడేలా కృషిచేస్తానని మాటిచ్చినట్లు రెడ్డి నేతలు చెప్పుకుంటున్నారు. అయితే అధికార పార్టీ అధినేత ఖర్చును తట్టుకునేందుకు సైతం తమ వంతుగా ప్రతాప్‌కు ఆర్థిక సహాయం అందిస్తామని వందమంది రెడ్డి నేతలు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ రెడ్డీల అంతర్గత వ్యూహం గజ్వేల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీని చిత్తు చేస్తుందా లేక చతికిల పడిపోతుందా అనేది వేచిచూడాల్సిందే!
Tags: Social groups in Gazelle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *