సోషల్ మీడియా ఖర్చు లెక్క పెట్టాల్సిందే

   Date:12/03/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతటి విశ్వరూపం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల కారణంగా ఎన్నికలు సైతం ప్రభావితమవుతున్న ఉదంతాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా, ఓటర్ నాడి పట్టడానికి, అతడిని ఆకర్షించడానికి సామాజిక మాధ్యమాన్ని మించింది లేదని ఆయా పార్టీలు ప్రత్యేకంగా విభాగాలు ఏర్పాటు చేసుకోవడం ఈ కోవలోకే వస్తుంది. అందుకే, కేంద్ర ఎన్నికల సంఘం ఓటరును ప్రలోభపెట్టే పార్టీలు, వ్యక్తులను నియంత్రించేందుకు కొత్త నియమావళిని రూపొందించింది. తాజాగా విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ సందర్భంగా అభ్యర్థులకు కొన్ని సూచనలు చేసింది.ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తప్పనిసరిగా తమ సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను కూడా పొందుపరచాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఆన్ లైన్ లో దర్శనమిచ్చే రాజకీయ ప్రకటనలకు ఇకమీదట ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరి అని, ఈ మేరకు గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సంస్థలు రాజకీయ ప్రకటనను పూర్తిగా పరిశీలించిన మీదటే అనుమతించాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీచేసింది. ఇలాంటి రాజకీయ ప్రకటనలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఆఫీసర్ ను కూడా నియమిస్తున్నట్టు ఈసీ పేర్కొంది. అంతేకాదు, ఓ అభ్యర్థి సామాజిక మాధ్యమాల్లో చేసే రాజకీయ ప్రచారానికి అయిన ఖర్చును కూడా ఎన్నికల ఖర్చుల పట్టికలో రాయాల్సిందేనని స్పష్టం చేసింది.
Tags:Social media cost calculation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *