వ్యవసాయక్షేత్రాలకు సోలార్ రక్షణ

Date:02/03/2018
ఆదిలాబాద్  ముచ్చట్లు:
ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పంటలకు నష్టం వాటిల్లుతోంది. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాలకు జంతువుల వల్లా నష్టం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అటవీశాఖ బాధిత రైతులకు పరిహారం అందిస్తుంది. కాని అది నామమాత్రమే. పెట్టుబడికి కూడ సరిపోదని రైతులు అంటున్నారు. పరిహారం అందడానికి ఏళ్లు పడుతుందని చెప్తున్నారు. ఈ విషయంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎస్సీ కార్పొరేషన్‌ ముందడుగేసింది. పంటలు సాగుచేసే ఎస్సీ రైతులకు చేయుతనివ్వనుంది. వన్యప్రాణుల బారినుంచి పంటలను రక్షించుకునే మార్గాలను అన్వేషించింది. పంట భూముల చుట్టు సౌరశక్తి కంచెలు, సాధారణ కంచెలను ఏర్పాటు చేస్తే అడవిజంతువులను రాకుండ అడ్డుకోవచ్చని అభిప్రాయపడుతోంది. సోలార్ కంచె ఏర్పాటు చేయాలంటే రూ.2 నుంచి 3 లక్షల ఖర్చు అవుతుంది. ఇంత పెద్దమొత్తం పేద రైతులకు ఇబ్బందిగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కంచె నిర్మాణానికి అయ్యే ఖర్చులను రాయితీ రుణాల ద్వారా అందించాలని ప్రయత్నిస్తోంది.
గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో పాటూ, సహ్యాద్రి పర్వతాల వల్ల స్థానికంగా వన్యప్రాణులు ఉంటున్నాయి. అటవీ ప్రాంతం సమీప గ్రామాల్లో సంచరిస్తున్న జంతువులు తరచూ పంటక్షేత్రాల్లోకి వస్తున్నాయి. ఫలితంగా పంట ధ్వంసమవుతోంది. దీంతో రైతులు తీవ్రనష్టాలకు గురవుతున్నారు. సోలార్ కంచెకు రాయితీ రుణాలు అందించే పథకం అమల్లోకి వస్తే తమకు ప్రయోజనకరంగా ఉంటుందని రైతన్నలు చెప్తున్నారు. పంటలను కాపాడుకుని మంచి దిగుబడులు అందుకునేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలాఉంటే 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో రూ.లక్ష 8 వేల ఎస్సీ జనాభా ఉంది. ప్రస్తుతం అది రూ.లక్షా 60 వేల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. వీరిలో దాదాపు 60 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. వీరిలో అందరు సన్నచిన్నాకారు నిరుపేద రైతులే అధికంగా ఉన్నారు. ఈ పథకం అమల్లోకి వస్తే 50 నుంచి 60 వేల మందికి లబ్ధి చేకూర్చినట్టవుతుంది. వీరికి సరిపడ నిధులు ప్రభుత్వం కేటాయిస్తే అర్హులైన ప్రతిఒక్కరికి పథకం ఫలితాలు అందుతాయని రైతు సంఘాలు అంటున్నాయి.
Tags: Solar protection for farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *