అప్పలాయగుంట బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు- జేఈవో వీరబ్రహ్మం
అప్పలాయగుంట ముచ్చట్లు:
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మే 31 వతేదీ నుండి జూన్ 8వతేదీ వరకు నిర్వహించనున్నందు వల్ల పటిష్ట ఏర్పాట్లు చేయాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆయన బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పుష్కరిణి ని పరిశీలించారు .అనంతరం అప్పలాయగుంట టీటీడీ కల్యాణ మండపంలో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా జేఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇంజినీరింగ్ పనులు రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీ శాఖ అధికారులు తండ్ల పటుత్వాన్ని పరిశీలించాలని చెప్పారు.
శ్రీవారి సేవకులను అవసరమైనంతమందిని నియమించాలని ఆయన సూచించారు. ఎస్వీబీసీ లో బ్రహ్మోత్సవాల ప్రోమోలు ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. నాలుగుమాడ వీధుల్లో గోవింద నామాలు వినిపించేలా ఏర్పాటు చేయాలన్నారు.
గరుడ సేవ, రథోత్సవం రోజుల్లో భక్తులకు తాగునీరు, మజ్జిగ, ప్రసాదాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు . వాహన సేవల సమయంలో కూడా భక్తులకు తాగునీరు అందించే ఏర్పాటు చేయాలన్నారు. విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ఏర్పాట్లు చేయాలని జేఈవో ఆదేశించారు. రథోత్సవాన్ని పురస్కరించుకుని రథం ఫిట్ నెస్ తనిఖీ చేయాలన్నారు. చలువ పందిళ్లను రేకులు లేకుండా ఏర్పాటు చేయాలని, గాలి వేగంగా వచ్చి రేకులు పడితే భక్తులకు ఇబ్బంది కలగవచ్చని చెప్పారు. నాలుగు మాడ వీధులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు . భక్తుల రద్దీని బట్టి అవసరమైతే అదనపు మరుగు దొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. గరుడ సేవ ఆదివారం వచ్చినందువల్ల శని, ఆది వారాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారన్నారు. ఎండ, గాలి, వాన నుండి భక్తులకు ఇబ్బంది లేకుండా నీడ కల్పించాలని చెప్పారు.

భక్తులందరికీ ఇబ్బంది లేని విధంగా మూల మూర్తి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఆలయంలో క్యూలైన్లను ఏర్పాటు చేయాలన్నారు. దర్శనం తరువాత భక్తులు సులువుగా బయటకు వచ్చేందుకు వీలుగా రద్దీ నియంత్రణకు విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
ఆలయాన్ని విద్యుత్తు, పుష్పాలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దాలన్నారు. భక్తుల సౌకర్యం కోసం పెద్ద అక్షరాలతో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకునేలా నిర్వహించాలని జేఈవో చెప్పారు.
డెప్యూటీ ఈవో లు గోవింద రాజన్, సుబ్రహ్మణ్యం, ఎస్ఈ లు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, డిప్యూటి సిఎఫ్ శ్రీనివాస్, ఈ ఈ మనోహర్, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ , విద్యుత్ విభాగం డిఈ చంద్ర శేఖర్, ఏఈవో ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
Tags: Solid arrangements for Appalayagunta Brahmotsavam- JEO Veerabraham
