తిరుచ్చిపై సోమస్కందమూర్తి

Date:18/02/2020

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం తిరుచ్చిపై సోమస్కందమూర్తి ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ ఎల్‌ టైప్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల భ‌జ‌న‌లు ఆకట్టుకున్నాయి.

శివచింతన కోసం కొందరు పర్వతగుహలలో ఒంటరిగా హఠయోగాభ్యాసం చేస్తున్నారు. మరికొందరు శీతాకాలంలో గంగాజలాలలో దిగి తపమాచరిస్తున్నారు. ఇంకొందరు గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్యలో ఒంటికాలి మీద నిలిచి ఘోర తపస్సు ఆచరిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ తమ చిత్తసరోజాలను పరమేశ్వరార్పణ చేయడానికే. కానీ మహాదేవుడైన కపిలేశ్వరస్వామికి బ్రహ్మోత్సవవేళ ఈ తిరుచ్చి వాహనంపై దర్శిస్తున్న భక్తుల చిత్తం అయత్నంగా పరమశివ పదాయత్తమవుతుంది.

అనంతరం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం వేడుక‌గా నిర్వహించారు. శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.

అధికారనంది వాహ‌నం :

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు అధికారనంది వాహ‌న‌సేవ వైభవంగా జరుగనుంది. కపిలేశ్వరస్వామి వాహనసేవలలో విశిష్ఠమైనది అధికారనంది. ఈ అధికారనందికి నామాంతరం కైలాసనంది. కైలాసంలో మెడలో మువ్వలదండలతో, కాళ్లకు గజ్జెలతో మనోహరాకారంతో, బంగారుకొమ్ములతో అలరారే నంది భవుడికి నిత్యవాహనం.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో   సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌   భూప‌తిరాజు, ఎవిఎస్వో  సురేంద్ర‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు   రెడ్డిశేఖ‌ర్‌,   శ్రీ‌నివాస్‌నాయ‌క్ ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు

Tags: Somaskandamurthy on Trichy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *