కమలం నుంచి ఎవరో….

హైదరాబాద్ ముచ్చట్లు:


బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎలాగైనా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురేయాలని చూస్తోంది. ఇందు కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకొనే పనిలో పడింది. వివిధ సందర్భాల్లో తెలంగాణ బీజేపీ నేతలకు ప్రాధాన్యం ఇస్తుంది ఢిల్లీ నాయకత్వం. పార్టీ పదవుల్లో ఇప్పటికే పెద్దపీట వేసింది. మోడీ సర్కార్‌లో కిషన్‌రెడ్డికి కేబినెట్‌ పదవి ఇచ్చింది. బండారు దత్తాత్రేయను గవర్నర్‌ను చేసింది. ఇదే కోవలో మరికొన్ని పదవులు కట్టబెట్టేందుకు సిద్ధమైందన్న ప్రచారం కాషాయ శిబిరంలో ఒక్కసారిగా అటెన్షన్‌ తీసుకొచ్చింది.తెలంగాణలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని మరికొందరు నేతలకు పదవులు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. తెలంగాణ నుంచి ఒకరిని రాజ్యసభకు పంపిస్తారనే టాక్ జోరందుకుంది. కేంద్ర పార్టీ నుంచి అలాంటి సంకేతాలు ఉన్నాయట. ఉత్తరప్రదేశ్ కోటాలో తెలంగాణ బీజేపీకి నేతకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం యూపీ నుంచి 11 రాజ్యసభ స్థానాల భర్తీకి కసరత్తు జరుగుతోంది. వాటిల్లో మెజారిటీ సీట్లు బీజేపీకే దక్కబోతున్నాయి. ఆ జాబితాలో తెలంగాణ బీజేపీ నేతకు చోటు ఇస్తారని అనుకుంటున్నారు.రాజ్యసభ గురించి సంకేతాలు రాగానే బీజేపీలో పలువురు పేర్లపై విస్తృతమైన చర్చ మొదలైంది. పార్టీ కోసం పనిచేస్తున్న వారికే అవకాశం ఇవ్వాలనే డిమాండ్‌ తెరపైకి వస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన మురళీధర్‌రావు,

 

 

రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్‌రావులపై పార్టీ ఫోకస్‌ పెట్టినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. వీరిలో గరికపాటి టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చారు. వీరిద్దరే కాకుండా మరికొన్ని సామాజిక అంశాలు కీలకం కాబోతున్నట్టు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ సామాజికవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఇంద్రసేనారెడ్డి తన వయసు రీత్యా గవర్నర్‌ పదవి కోరుతున్నారట. ఇదే సమయంలో ఒకరిద్దరు పారిశ్రామిక వేత్తల పేర్లు కూడా ఢిల్లీ పరిశీలనలో ఉన్నాయట.దేశవ్యాప్తంగా భర్తీ కానున్న రాజ్యసభ స్థానాలకు ఈ నెల 24న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 31 వరకు నామినేషన్‌ దాఖలుకు గడువు ఉంది. ఆలోగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని.. బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి తెలంగాణలో ఒకరికి పిలుపు వస్తుందని భావిస్తున్నారు. ఏపీకి చెందిన జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అందుకే తాజా ప్రచారంపై తెలంగాణ బీజేపీ నేతల్లో ఆసక్తి నెలకొంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

 

Tags: Someone from the lotus ….

Leave A Reply

Your email address will not be published.