Special package for journalists to be announced

జర్నలిస్టులకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలి 

Date:03/05/2020

అమరావతి ముచ్చట్లు:

దేశ వ్యాప్తంగా జర్నలిస్టులు జాగ్రత్త వహించాలి. తెలుగు వార్తా చానెల్స్ లలో, పత్రికల్లో  పనిచేసే జర్నలిస్టులు వార్తల కోసం రోడ్లమీదనే ఉంటున్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, మునిసిపల్ సిబ్బందికి ఏ మాత్రం తీసిపోకుండా మీడియా మిత్రులు బాగా కష్టపడుతున్నారు. ప్రజలకు సమాచారం చేరవేయడంలో, వారిని చైతన్యపరచడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉంది.దేశవ్యాప్తంగా పత్రికలు, ఛానెళ్ల యాజమాన్యాలు ఈ కీలక తరుణంలో జర్నలిస్టుల ఉద్యోగాలపై నిర్దాక్షిణ్యంగా కోత విధిస్తూ పనిభారం పెంచుతున్నాయి. ఉద్యోగాలు కాపాడుకోవాలంటే జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి పనిచేసి వృత్తినిబద్ధతను చాటుకోకతప్పని పరిస్థితిని కల్పిస్తున్నారు. కనీస రక్షణ సౌకర్యాలు, బీమా సౌకర్యమైనా లేకుండా మీడియా మిత్రులు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా లో పనిచేసేవారు, రోడ్ల మీద, ఆసుపత్రుల్లో వార్తల కోసం పిచ్చిపిచ్చిగా తిరగక తప్పని పరిస్థితి.

 

 

 

ఈ మాయదారి వైరస్ బారిన పడకుండా జర్నలిస్టులు తమంతట తాము ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అటు యాజమాన్యాల నిరాదరణకు, ఇటు ప్రభుత్వాల ఈసడింపులకు గురవుతున్న జర్నలిస్టుల గురించి సభ్య సమాజం, మేథావులు మాట్లాడడం మొదలెట్టాలి. కొన్ని మీడియా సంస్థల మీద ఉన్న కోపంతో జర్నలిస్టులను పట్టించుకోకుండా ఉండకపోవడం దారుణం. మెజారిటీ జర్నలిస్టులు మౌనంగా రోదిస్తూ, నిరాశామయ భవిషత్తును వీక్షిస్తూ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. అధికారం పంచనజేరి ఖుషీగా ఉన్న జర్నలిస్టు సంఘాల నేతలు ప్రభుత్వాలు కనికరించేలా తమ పలుకుబడిని ఉపయోగించి జర్నలిస్టులను ఆదుకోవాలి. కోవిడ్ సోకి కలం వీరులు, వీడియో గ్రాఫర్లు రేపు ప్రాణాల మీదికి తెచ్చుకున్నా పట్టించుకునే వారు లేని దౌర్భాగ్య పరిస్థితి నేడుంది.

 

 

 

ఈ నేపథ్యంలో… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల బతుకుకు భరోసా ఇస్తూ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని  ఈ బ్లాగు అభ్యర్ధిస్తున్నది. సరైన జీతాలు లేక, సేవింగ్స్ లేక, బతుకుకు గ్యారెంటీ లేక జర్నలిస్టులు, వారి కుటుంబ  సభ్యులు కుమిలిపోతున్నారు. జర్నలిస్టుల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. అందుకే, తెలంగాణా ప్రభుత్వ పెద్దలు జర్నలిస్టులకు పెద్ద మనసుతో భరోసా ఇచ్చే ప్యాకేజ్ వెంటనే ప్రకటించి దేశంలో వివిధ రాష్ట్రాలకు  మార్గదర్శకం కావాలి. అంతకన్నా ముందు… ఇంతటి విషాద సమయంలో జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల ఉద్యోగాలపై వేటు వేసే పత్రికల, ఛానెళ్ల గుర్తింపు రద్దుచేస్తామని, ఐదేళ్ల పాటు ప్రకటనలు ఇవ్వబోమని సత్వరమే హెచ్చరిక జారీ చేయాలి.

 

 

 

 

జర్నలిస్టు మిత్రులారా…. ఈ పోస్టు చదివి వదిలేయకండి. ఈ  రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాధినేతలకు, మంత్రులకు, పలుకుబడి కలిగిన వారికి పంపి విషయాన్ని వారి దృష్టికి తెండి. కార్యాచరణకు ఉపక్రమించాలి కోరండి. అద్భుతంగా పనిచేస్తూ… పవిత్ర కర్తవ్యాన్ని నెరవేరుస్తూనే… కరివేపాకు అయిపోతున్న మీ కోసం మీరే గళం విప్పాలి. ఈ పని ఈ క్షణమే చేయాలి. (తెలుగు మీడియా కబుర్లు) సౌజన్యంతో

రుయా నుండి నేడు 8 మంది మంది డిస్సార్జి… రుయా సూపరినెంట్ భారతి

Tags: Special package for journalists to be announced

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *