అంకాళమ్మ వారికి విశేష పూజలు
శ్రీశైలం ముచ్చట్లు:
శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకాళమ్మ వారికీ శుక్రవారం రోజు ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించారు. ప్రతి శుక్రవారం రోజున శ్రీఅంకాళమ్మ వారికి దేవస్థానం సేవగా (సర్కారి సేవగా)ఈ విశేషపూజ జరిపించబడుతోంది.ఇందులో భాగంగా శ్రీ అంకాళమ్మ వారికి అభిషేకం, విశేష అర్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు జరిపించబడ్డాయి.కాగా శ్రీశైల క్షేత్రానికి గ్రామదేవతగా చెప్పబడుతున్న అంకాళమ్మ ఆలయం, ప్రధాన ఆలయానికి ఎదురుగా గల రహదారికి చివరలో కుడివైపున ఉత్తరముఖంగా ఉంది.ప్రకృతి శక్తుల యొక్క కళలే గ్రామ దేవతలని దేవీభాగవతంలో చెప్పబడింది. ఈ ప్రకృతి అంతాఆదిపరాశక్తి స్వరూపమేనని మన ఆరవాజ్ఞ్మయం చెబుతోంది. దైవశక్తి సమాజంలో ఏదో కొన్ని వర్గాలకు పరిమితం కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని తెలియజెప్పే మన విశిష్ట సంస్కృతి యొక్క ఉదాత్త వైఖరికి తార్కాణంగా ఈ గ్రామదేవత ఆరాధనను పేర్కొనవచ్చు. చతుర్భుజాలను కలిగిన ఈ దేవి నాలుగు చేతులలో కుడివైపున క్రింది నుండి పైకి వరుసగా కత్తి. డమరుకంతో చుట్టబడిన ఉండగా, ఎడనువైపున పానపాత్ర, త్రిశూలం ఉన్నాయి. కిరీట ముకుటం గల ఈ దేవి వస్త్రాలంకురాలై కర్ణాభరణాలను, కంఠాభరణాలను కలిగి ఉంటుంది. కాగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజ జరిపించబడింది. ఆ తరువాత లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. అనంతరం పంచామృతాభిషేకం, హరిదోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం విశేష అభిషేకం అర్చన నిర్వహించారు.

Tags: Special pujas for Ankalamma
