శ్రీ భోగశ్రీనివాసమూర్తికి వేడుకగా ప్రత్యేక సహస్రకలశాభిషేకం
తిరుమల ముచ్చట్లు:
శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన రోజును పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక సహస్రకలశాభిషేకం ఆదివారం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, శ్రీ విష్వక్సేనులవారిని వేంచేపు చేశారు. శ్రీవారి మూలమూర్తికి ముందు గరుడాళ్వార్ సన్నిధిలో కౌతుకమూర్తి అయిన శ్రీ మనవాళపెరుమాళ్(శ్రీ భోగ శ్రీనివాసమూర్తి)ను,
ఆయన కు అభిముఖంగా శ్రీ విష్వక్సేనులవారిని ఉంచారు. తర్వాత శ్రీవారి మూలమూర్తిని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి కలుపుతూ దారం కట్టి అనుసంధానం చేశారు. అనగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి నిర్వహించే అభిషేకాధి క్రతువులు మూలమూర్తికి నిర్వహించినట్లు అవుతుంది. అనంతరం వేద పండితులు వేద పారాయణం చేయగా, అర్చకస్వాములు ప్రత్యేక సహస్రకలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. కాగా శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన జీయర్ స్వామి, టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాధం, పేష్కార్ శ్రీహరి, పార్‌పత్తేదార్ ఉమామహేశ్వర్ రెడ్డి, అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
Tags; Special Sahasrakalasabhishekam in celebration of Shri Bhogashreenivasamurthy

