ప్రత్యేక హోదా  రాజకీయ ఆయుధం

కడపముచ్చట్లు :

 

 

రాజకీయాల్లో సమస్యలు అలాగే ఉండాలి. అవి పరిష్కారం అయితే నాయకులకు కానీ పార్టీలకు కానీ పెద్ద పని ఉండదు. రామాలయం ఇష్యూ మీద ఒక పార్టీ చాన్నాళ్ళు రాజకీయాలు నడిపింది. అలాగే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం అన్నది ఉమ్మడి ఏపీలో నాలుగు దశాబ్దాలుగా నలిగి ఎందరికో రాజకీయ ఉపాధిని కల్పించింది. విభజన తరువాత ఏపీకి ప్రత్యేక హోదా ఒక రాజకీయ ఆయుధంగా మారుతోంది. ఈ నినాదంతో 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమి గెలిస్తే దాన్ని రివర్స్ చేస్తూ 2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ విక్టరీని కొట్టింది. ఇపుడు మరో మారు ప్రత్యేక హోదా అన్నది వైసీపీకి అక్కరకు వస్తోందా అన్న చర్చ అయితే ఉంది.ఈ ప్రత్యేక హోదా అన్నది ఎలాంటిది అంటే తెలియని సెంటిమెంట్ ని ఏదో రగిలిస్తూ ఉంటుంది. దీనిని జనాలు మరచిపోయారు అని అనుకుంటారు కానీ సైలెంట్ ఓటింగ్ చేసే అతి పెద్ద రాజకీయ దినుసుగా ఇప్పటికీ దీనికి విలువ ఉంది. అంటే ఎన్ని సార్లు వాడినా వాడని రాజకీయ సరకు అన్న మాట. ఇపుడు దీన్ని మళ్ళీ వైసీపీ బయటకు తీస్తోందిట.

దీన్ని అడ్డం పెట్టుకుని అటు ఏపీలో బీజేపీ కూటమి ఎదగకుండా చేయడంతో పాటు, చంద్రబాబు బీజేపీ గూటికి చేరకుండా అడ్డుకోవాలన్నది వైసీపీ తాజా ఎత్తుగడట. అదే సమయంలో హోదా మీద పేటెంట్ హక్కులు అన్నీ తనవేనని గట్టిగా చెప్పుకోవడం కూడా వైసీపీకి అవసరంగా ఉంది.ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఉలకడం లేదు, పలకడం లేదు అంటూ జగన్ కి అత్యంత సన్నిహితుడు, ఆయన జిల్లాకే చెందిన కీలక నేత శ్రీకాంత్ రెడ్డి బలమైన గళమే ఎత్తారు. కేంద్రానికి ఈ రెండేళ్లలోనూ ఎన్నో సార్లు విన్నవించుకున్నా అసలు పట్టించుకోలేదని కూడా ఆయన గుస్సా అయ్యారు. ఏపీకి సంజీవిని లాంటి హోదా విషయంలో తమ పోరాటం ఎక్కడా ఆగలేదని శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు. అంటే వైసీపీకి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఆయన చెప్పారన్న మాట. ఇక చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని గత రెండేళ్లలో ఒక్కసారి కూడా అడగలేదని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. బాబుకు మోడీ అంటే భయమని కూడా ఆయన సెటైర్లు వేశారు.ప్రత్యేక హోదా అన్నది తమ అజెండాలో అగ్రభాగంలో ఎప్పటికీ ఉంటుందని శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు. ఎవరి వదిలేసినా తాము మాత్రం దీన్ని సాధించేవరకూ అడుగుతూనే ఉంటామని ఆయన అంటున్నారు. మరి బీజేపీ ఇది ముగిసిన అధ్యాయమని అంటోంది. ఏపీ బీజేపీ నాయకులు అయితే ఈ మాటను అసలు పలకడానికే సిధ్ధంగా లేరు. మరో వైపు బీజేపీకి మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ కూడా హోదా డిమాండ్ ని పక్కన పెట్టారు. టీడీపీ తరఫున అపుడపుడు ఎంపీలు మాట్లాడుతున్నా చంద్రబాబు మాత్రం అధినాయకుని హోదాలో ఇప్పటిదాకా ఈ మాట అనలేదు. దాంతో ప్రత్యేక హోదా అని మళ్లీ వైసీపీ గర్జిస్తే మాత్రం ఆ పార్టీకే దీని మీద అన్ని హక్కులూ కచ్చితంగా ఉంటాయని అంటున్నారు. సరే ప్రత్యేక హోదా గురించి వైసీపీ అడుగుతోంది దాన్ని ఎవరూ కాదనడంలేదు కానీ మోడీ నుంచి దాన్ని తీసుకురాలేకపోయారు అన్న అసంతృప్తి అయితే ఆంధ్రా జనాలలో ఉంది. మరి 2024 వరకూ ప్రత్యేక హోదా తెస్తామని చెబుతూ మళ్ళీ ఎన్నికలకు వెళ్తే వైసీపీకి ప్రజలు మద్దతు ఇస్తారా, మునుపటిలా ఈ ఆయుధం ఇంకా పదునుగానే ఉంటుందా. చూడాలి మరి.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Special status is a political weapon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *