– ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి
తిరుమల ముచ్చట్లు:
శ్రీవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ప్రదర్శించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన రచనలతో స్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేశారని శతావధాని ఆముదాల మురళి పేర్కొన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు జరిగింది. సదస్సుకు అధ్యక్షత వహించిన ఆముదాల మురళి ఉపన్యసిస్తూ, తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ద్వారా టీటీడీ వెంగమాంబ రచనలు వెలుగులోకి తీసుకొని వస్తున్నట్లు చెప్పారు. జూల కంటి బాలసుబ్రమణ్యం రచించిన తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్రను పునర్ముద్రించి విద్యార్థులకు ఉచితంగా పంచుతున్నట్లు తెలిపారు. వెంగమాంబ రచించిన ద్విపద భాగవతంలోని చతుర్దస్కంథాన్ని త్వరలోనే ప్రచురించనున్నట్లు ఆయన వివరించారు.శ్వేత ఇంచార్జ్ సంచాలకులు రాజగోపాల్ మాట్లాడుతూ, తరిగొండ వెంగమాంబ జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. నైతిక విలువలు పాటిస్తూ, ధార్మిక జీవనం గడపాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. అనంతరం కేరళ చిత్రకారిణి కృష్ణప్రియ చిత్రించిన తరిగొండ వెంగమాంబ చిత్రపటాన్ని రాజగోపాల్ ఆవిష్కరించి, చిత్రకారిణిని సన్మానించారు.ప్రముఖ పరిశోధకులు డాక్టర్ కేశవులు మాట్లాడుతూ, తరిగొండ వెంగమాంబ జీవితాన్ని, రచనను సమగ్రంగా పరిచయం చేశారు. ఎస్వీ విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధన సంస్థ అధ్యాపకులు డా.రాజశేఖర్ ఉపన్యసిస్తూ, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచించిన తొమ్మిది యక్షగానాలను గురించి సమగ్రంగా వివరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
Tags: Spiritual consciousness with the works of Vengamamba: Shatavadhani Amudala Murali