Natyam ad

దుర్గమ్మ సొమ్ముకే రక్షణ కరువా…

-మూస పద్దతిలో కౌంటింగ్

విజయవాడ ముచ్చట్లు:

Post Midle

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం… రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. నిత్యం వేలాది మంది భక్తులు రాక.. రోజుకు రూ.13.90 లక్షలకు పైగానే హుండీ  ఆదాయం… ఇక దసరా, భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు ముగిస్తే కానుకల లెక్కింపు మూడు, నాలుగు రోజులు సాగాల్సిందే! రోజుకు వెయ్యి నుంచి 30 వేల పైబడి భక్తులకు పెరిగినా… కానుకల లెక్కింపులో మాత్రం దేవస్థానం ఇంకా మూస పద్ధతినే అవలంభిస్తున్నారు. దీంతో అమ్మవారి కానుకలు, మొక్కుబడులు చేతి వాటానికి గురవుతున్నాయి.గడిచిన ఐదేళ్ల కాలంలో పదికి పైగా ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ఘటనల్లో ఆలయ సిబ్బంది నేరుగా ఉంటే మరి కొన్ని సంఘటనల్లో సేవా సిబ్బంది, అవుట్‌ సోర్స్‌ సిబ్బంది ఉంటున్నారు. టీ కప్పులో బంగారం తాడు దాచి దొరికి పోయిన వైనం ఒకటయితే.. హుండీల నుంచి కానుకలను మహా మండపానికి తరలించేందుకు తీసుకెళ్లే ప్లాస్టిక్‌ సంచులలో బంగారాన్ని దాచి పెట్టి దొరిపోయిన వైనం మరోటి. సేవకు వచ్చి బంగారం,

 

 

 

డబ్బు చక్క బెట్టేసిన వైనం ఇంకొకటి.. ఇలా బయట పడిన ఘటనలు కొన్ని.. ఇంక బయట పడని ఘటనలు ఎన్ని ఉన్నాయోననే అనుమానాలు భక్తులు వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానానికి కానుకలు, మొక్కుబడులు పెరుగుతున్న తరుణంలో ప్రతి వారం లేదా పది రోజులకు ఒక సారి లెక్కింపు జరిగితే ఇటువంటి ఘటనలకు చెక్‌ పెట్టవచ్చునని భక్తులు అభిప్రాయపడుతున్నారు.  శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను ప్రస్తుతం 15 రోజులకు ఒక సారి చేపడుతున్నారు. దీంతో ఆలయంలోని అన్ని హుండీల నుంచి ఒకే సారి కానుకలను లెక్కింపుకు తీయడంతో అవి వంద నుంచి 120కి పైగా మూటలవుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కానుకలను లెక్కించడం ఆలయ సిబ్బందికి ఇబ్బందికరంగా ఉంది. లెక్కింపుకు ఆలయ సిబ్బందితో పాటు సేవా సిబ్బందిని అనుమతిస్తారు. దీంతో కానుకల లెక్కింపు ప్రాంతమంతా గందరగోళంగా మారడమే కాకుండా ఎవరు ఏం చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి.  సోమవారం కూడా ఇదే జరిగింది. ఆలయ సిబ్బంది గంటల తరబడి నేలపై కూర్చోవడం ఇబ్బందికరమే. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆదమరుపుగా ఉన్న తరుణంలో చేతివాటాన్ని ప్రదర్శించి కానుకలను పక్కదారి పట్టించారు. వారంలో ఒక రోజు కానుకల లెక్కింపు క్రమం తప్పకుండా జరిగితే సాయంత్రానికి లెక్కింపు పూర్తవుతుందని ఆలయ ఉద్యోగులు పేర్కొంటున్నారు.

 

 

దీని వల్ల బయటి వ్యక్తులను లెక్కింపునకు పిలవాల్సిన అవసరం కూడా ఉండదని ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. దేవస్థానంలో ప్రస్తుతం పరిపాలనా విభాగం, పూజల విభాగం, ఇంజనీరింగ్‌ విభాగం, శానిటేషన్‌ విభాగాలతో పాటు మరి కొన్ని విభాగాలు ఉన్నాయి. అయితే అమ్మవారికి భక్తులు అందచేసే విరాళాలు, కానుకలను ఒక విభాగంగా చేసి బాధ్యులను అప్పగిస్తే ఫలితాలు బాగుంటాయని ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రస్తుతం అమ్మవారి ఆలయానికి, అన్నదానం, అభివృద్ధి పనులకు దాతలు విరాళాలు అందచేస్తుంటారు. అయితే ఈ విరాళాల సేకరణ ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని గతంలో పలువురు ఈవోలు ప్రతిపాదనలు సిద్ధం చేసినా అవి కార్యరూపం దాల్చలేదు. విరాళాల సేకరణతో పాటు అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల పర్యవేక్షణ రెండు కలిసి ఒక విభాగం చేసి ఎఈవో స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. 15 రోజలకు ఒక సారి లెక్కింపు జరగడం కానుకలు లెక్కించే ప్రాంతంలోకి వచ్చే సిబ్బందికి మాత్రమే తనిఖీలు ఉండటం  ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు లెక్కింపు జరగడం సేవా సిబ్బంది పేరిట కొంత మంది సిఫార్సు చేసిన వారిని లెక్కింపులోకి అనుమతించడం లెక్కింపు జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నా, ఏదైనా ఘటన జరిగిన సమయంలో అవి ఉపయోగకరంగా లేకపోవడం కానుకల లెక్కింపులో పాల్గొనే పోలీసు, సెక్యూరిటీ, హోంగార్డులను సైతం తనిఖీలు లేకపోవడంతో సిబ్బంది ఆడింది ఆట..పాడింది పాటగా మారిపోయింది.

 

Tags: Sri Durga Malleshwara Swamy Warla Temple

Post Midle

Leave A Reply

Your email address will not be published.