చిన్నశేష వాహనంపై ద్వారక కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప
తిరుమల ముచ్చట్లు:
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ద్వారక కృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.

చిన్నశేష వాహనం – కుటుంబ శ్రేయస్సు
చిన్నశేషుడిని వాసుకి(నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:Sri Malayappa in Dwarka Krishna’s decoration on Chinnashesha vehicle
