గజ వాహనంపై శ్రీ మలయప్ప కటాక్షం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు గజ వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.గజ వాహనం – కర్మ విముక్తి రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహనసేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:Sri Malayappa’s criticism of Gaja Vahanam
