Sri Padmavathi Amman's Kartika Brahmotsava is special

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాల ప్రత్యేకం

న‌వంబ‌రు 22న తిరుచానూరులో ల‌క్ష‌కుంకుమార్చ‌న‌, అంకురార్పణ

Date:20/11/2019

తిరుమల ముచ్చట్లు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ కార్తీక బ్రహ్మూత్సవాలకు నవంబరు 22వ తేదీ శుక్రవారం అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో లక్షకుంకుమార్చన వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఘట్టాల విశేషాలను తెలుసుకుందాం. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవర్లను శ్రీకృష్ణస్వామి ముఖ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.1,116/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, రెండు లడ్లు, రెండు వడలు బహుమానంగా అందజేస్తారు. ఆలయం వద్దగల కౌంటర్‌లో కరంట్‌ బుకింగ్‌లో భక్తులు ఈ టికెట్లు పొందొచ్చు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు.

 

 

 

 

 

 

 

అంకురార్పణ ఘట్టంలో ముందుగా భగవంతుని అనుజ్ఞ తీసుకుని షోడషోపచారాలు సమర్పిస్తారు. సమస్తమైన విఘ్నాలు తొలగేందుకు విష్వక్సేనారాధన నిర్వహిస్తారు. ఆ తరువాత స్థల శుద్ధి, ద్రవ్యశుద్ధి, శరీర శుద్ధి, ఆత్మశుద్ధి కోసం పుణ్యహవచనం చేపడతారు. పుణ్యమైన మంత్రాలను పఠించి కలశంలోని నీటిని శుద్ధి చేయడాన్ని పుణ్యహవచనం అంటారు. సభాపూజలో భాగంగా భగవంతునికి సాష్టాంగ ప్రమాణం సమర్పించి అనుజ్ఞ తీసుకుంటారు. యాగశాలలో ఎవరెవరు ఎలాంటి విధులు నిర్వహించాలనే విషయాన్ని రుత్విక్‌వరణంలో వివరిస్తారు. అంకురార్పణ కార్యక్రమంలో ప్రధాన ఘట్టం మృత్సంగ్రహణం. అమ్మవారి ఆలయం వద్దగల శుక్రవారపు తోటలో ఈశాన్య దిశలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ముందుగా శ్రీభూవరాహస్వామివారిని ప్రార్థించి, గాయత్రి అనుష్టానం, భూసూక్తం పారాయణం చేస్తారు. ధూపదీప నైవేద్యం సమర్పించి మాషాచోప(మినుముల అన్నం) బలిహరణ చేస్తారు. ఆ ప్రాంతాన్ని గోమూత్రం, గోమేయంతో శుద్ధి చేసి భూమాతను ఆవాహన చేసి వస్త్రసమర్పణగావిస్తారు. భూమాత ఉధ్వాసన అనంతరం పుట్టమన్ను తీసుకుని ఆలయానికి వేంచేపు చేస్తారు. యాగశాలలో వాస్తుదోష నివారణ కోసం హవనం నిర్వహిస్తారు. ఆ తరువాత పాలికల్లో మట్టిని, నవధాన్యాలను ఉంచి పసుపునీళ్లు చల్లి బీజవాపనం చేస్తారు. అనంతరం నివేదన, బలిహరణ, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద గోష్టి నిర్వహిస్తారు.

 

 

అఖండ దీపారాధన :

యాగశాలలో అంకురార్పణ సందర్భంగా అఖండదీపారాధన చేస్తారు. బ్రహ్మూత్సవాలు జరిగే తొమ్మిది రోజులు ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది. అనంతరం ఈ దీపాన్ని గర్భాలయంలో గల దీపంలో ఐక్యం చేస్తారు. అంకురార్పణ ఘట్టానికి వైఖానసం, పాంచరాత్ర ఆగమాల్లో విశేష ప్రాధాన్యం ఉందని, ఇవి భగవంతునికి రెండు కళ్లు లాంటివని తితిదే పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీమత్‌ తిరుమల కాండూరి శ్రీనివాసాచార్యులు తెలిపారు. వైఖానసంలో మంత్రభాగాన్ని ప్రధానంగా తీసుకుని విష్ణువును అర్చిస్తారని, పాంచరాత్రంలో మంత్రం, తంత్రం, క్రియ, ముద్రలు ప్రధానంగా ఉంటాయని తెలియజేశారు.

 

 

 

లక్ష కుంకుమార్చన :

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో దాదాపు 13 సంవత్సరాల క్రితం లక్ష కుంకుమార్చన సేవను ప్రవేశపెట్టారు. ఇందులో అమ్మవారి సహస్రనామాన్ని 10 సార్లు 20 మంది అర్చకస్వాములతో ప్రార్థన చేస్తారు. అమ్మవారు మంచి శక్తితో ఉండి పది రోజుల పాటు బ్రహ్మూత్సవాల్లో భక్తులందరికీ పరిపూర్ణమైన కృపాకటాక్షాలు అందించాలని కోరుతారు. లక్ష కుంకుమార్చనలో పాల్గొనే భక్తులకు శక్తి, ముక్తి, భక్తి కలుగుతుందని అర్చకులు తెలిపారు.

 

తిరుమల \|/ సమాచారం

 

Tags:Sri Padmavathi Amman’s Kartika Brahmotsava is special

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *