Sri Padmavathi Ammavari Brahmotsavam Vehicle Services

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల వాహ‌న‌సేవ‌ల వైశిష్ట్యం

Date:21/11/2019

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు న‌వంబ‌రు 23 నుండి డిసెంబ‌రు 1వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. మొద‌టిరోజు శ‌నివారం ఉదయం 8.30 నుంచి 8.50 గంటల నడుమ వృశ్చిక లగ్నంలో ధ్వజారోహణం వేడుకగా జరుగనుంది. బ్ర‌హ్మోత్స‌వాల్లో 9 రోజుల పాటు ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7.30 నుండి 11 గంట‌ల వ‌రకు వాహ‌న‌సేవ‌లు జ‌రుగుతాయి. వాహ‌న‌సేవ‌ల వైశిష్ట్యం ఇలా ఉంది.

 

చిన్నశేష వాహనం

అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారిని దర్శించిన భక్తులకు యోగసిద్ధి చేకూరుతుంది.

 

పెద్దశేష వాహనం :

శ్రీపద్మావతి మాతకు కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా పెద్దశేషుడు సేవలందిస్తాడు. శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది.

 

హంస వాహనం :

భారతీయ సంస్కృతిలో అనాదిగా మహావిజ్ఞాన సంపన్నులైన మహాత్ములను, యోగిపుంగవులను ”పరమహంస”లుగా పేర్కొనడం సంప్రదాయం. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే నీరు, పాలు వేరు చేయగలగడం. యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అట్టి మహాయోగి పుంగవుల హ దయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ”హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు.

 

ముత్యపుపందిరి వాహనం :

ముత్యాలు అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని, తామ్రనదీతీరంలో లభిస్తాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశాడు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం ఫలంగా చేకూరుతుంది.

 

సింహ వాహనం :

సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, వాహనశక్తికి ప్రతీక.  అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తుంది. భగవతి పద్మావతి ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తుంది. శ్రీ వేంకటేశ్వర హ దయేశ్వరిని స్వామితో మమేకమైన శక్తిగా ధ్యానించడం సంప్రదాయం.

 

కల్పవృక్ష వాహనం :

బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజు ఉదయం అమ్మవారు కల్పవృక్ష వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు. పాలకడలిని అమృతం కోసం మథించినవేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలిదప్పుల్ని తొలగించి, పూర్వజన్మస్మరణను ప్రసాదించే ఈ ఉదార దేవతావ క్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది. కోరికలను తీర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రిత భక్తులకు కష్టాలను తొలగించే పరిపూర్ణశక్తి.

 

హనుమంత వాహనం :

హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది.

 

పల్లకీలో మోహిని అవతారం :

బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజున ఉదయం మోహిని అవతారంలో అమ్మవారు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తారు. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్నిగుర్తుంచుకోలేకపోయింది. ఈనాటి అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది.

 

గజవాహనం :

శ్రీ పద్మావతి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది గజ వాహనం. బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు రాత్రి పద్మావతి అమ్మవారు స్వర్ణ గజ వాహనంపై విహరిస్తారు. గజపటాన్ని ఆరోహణం చేయడంతోనే అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. గజం ఐశ్వర్యసూచకం. అందుకే ”ఆగజాంతగం ఐశ్వర్యం” అని ఆర్యోక్తి. పాలసంద్రంలో ప్రభవించిన సిరులతల్లికి గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతమని చెబుతారు.

 

సర్వభూపాల వాహనం :

బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై భక్తులకు కనువిందు చేస్తారు. శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగ అలమేలుమంగ. సర్వభూపాలురు ఆయా స్థానాల్లో ఉండి అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో దిక్పాలకులు కూడా ఉన్నారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు.

 

గరుడ వాహనం :

గరుడుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు గుర్తుగా భావిస్తారు. శ్రీవారినీ, అమ్మవారినీ నిత్యం సేవించే గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా ఇంకా పలు విధాలుగా సేవిస్తున్నారు. గరుడపచ్చను వక్షఃస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు, పద్మావతీ సమేతంగా నిజసుఖాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞానవైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలుమంగమ్మను దర్శించి సేవించినవారికి మోక్షసుఖం లభిస్తుంది.

 

సూర్యప్రభ వాహనం :

బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు ఉదయం అమ్మవారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది.

 

చంద్రప్రభ వాహనం :

క్షీరసాగరంలో సముద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. 16 కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే అలమేలు మంగను సేవించే భక్తులపై ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి.

 

రథోత్సవం :

బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ఉదయం వృశ్చిక లగ్నంలో రథోత్సవం కన్నులపండుగగా జరుగుతుంది. శరీరం – రథం, ఆత్మ- రథికుడు, బుద్ధి – సారథి, మనస్సు – పగ్గాలు, ఇంద్రియాలు – గుర్రాలు. ఇంద్రియ విషయాలు రథం నడిచే త్రోవలు. రథం రథికుణ్ని చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మ విషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది.

 

అశ్వవాహనం :

అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. అలమేలుమంగ అన్ని కోరికలను తీర్చడంలో ఒకే ఒక ఉపాయంగా, సౌభాగ్యంగా ఆర్ష వాఙ్మ‌యం తెలియజేస్తోంది. పద్మావతీ శ్రీనివాసుల తొలిచూపు వేళ, ప్రణయవేళ, పరిణయవేళ అశ్వం సాక్షిగా నిలిచింది. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవాభాగ్యాన్ని పొందుతున్న భక్తులకు కలిదోషాలను తొలగిస్తుంది.

 

పంచమితీర్థం :

కార్తీక శుక్ల పంచమి నాడు పద్మసరోవరాన్ని సేవించడాన్నే తిరుచానూరు పంచమిగా భక్తులు పేర్కొంటారు. ఆనాడే పద్మసరోవరం నుంచి అలమేలుమంగ ఆవిర్భవించి శ్రీనివాసునికి ప్రసన్నమై స్వామి తపస్సును ఫలింపజేసింది. అందుకే బ్రహ్మాది దేవతలు, ఎందరో మహర్షులు ఈ తీర్థాన్ని కొనియాడారు. పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు, తిరిగి వెళ్లేందుకు ప్రత్యేకంగా గేట్లు ఏర్పాటుచేస్తారు. పుష్కరిణి పవిత్రత మూడు రోజుల పాటు ఉంటుందని పురాణాల ద్వారా తెలుస్తోంది.

 

ధ్వజావరోహణం :

తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ఘనంగా ముగుస్తాయి. ఈ సందర్భంగా గజ పటాన్ని అవనతం చేసి దేవతలను వారి వారి స్థానాలకు సాగనంపుతారు.

 

పుష్పయాగం :

బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటిరోజు పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. వైదికుల వేదపారాయణం నడుమ చామంతి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి వంటి 12 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ, పన్నీరాకు వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి సమర్పిస్తారు. శ్రీపద్మావతి అమ్మవారికి నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. పుష్పయాగం వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయన్నది అర్చకుల మాట.

 

న‌వంబ‌రు 23న శ్రీనివాసమంగాపురంలో కార్తీక వనభోజనం

 

Tags:Sri Padmavathi Ammavari Brahmotsavam Vehicle Services

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *