Natyam ad

తెలుగు ప్రజల ఆరాధ్యనీయుడు పొట్టి శ్రీరాములు : టీటీడీ జేఈవో  సదా భార్గవి

తిరుపతి ముచ్చట్లు:

తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయుడు అమరజీవి   పొట్టి శ్రీరాములు అని టీటీడీ జేఈవో   సదా భార్గవి కొనియాడారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో   పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈవో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ మొదటిసారిగా  పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. తెలుగు భాషకున్న ప్రాముఖ్యత, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో కలిగే లాభాలను దృష్టిలో ఉంచుకుని ఆయన అహింసా పద్ధతిలో పోరాటాన్ని కొనసాగించారని తెలిపారు. గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతో పాటు పడ్డారని చెప్పారు. ఇతరుల కోసం తమ జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాడేవాడే నాయకుడిగా నిలుస్తాడన్నారు.
పొట్టి శ్రీరాములు ఇందుకు నిదర్శనమని అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా వెళ్లాలన్న ఆయన దృఢ సంకల్పం ఎంతో గొప్పదన్నారు.

 

 

Post Midle

ఉపన్యాసకులుగా విచ్చేసిన తిరుపతికి చెందిన డా. మన్నవ గంగాధరప్రసాద్ మాట్లాడుతూ చెన్నైలో పుట్టి పెరిగిన   పొట్టి శ్రీరాములు ముంబైలో రైల్వే ఉద్యోగం చేశారని చెప్పారు. ఆ తర్వాత గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై సబర్మతి ఆశ్రమానికి వెళ్లారని చెప్పారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని పలుమార్లు జైలుకు వెళ్లారని తెలిపారు. గాంధీజీ స్ఫూర్తితో హరిజనులకు ఆలయ ప్రవేశం చేయించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. గాంధీ స్మారక నిధి సంచాలకులుగా మద్రాస్ రాష్ట్రమంతా పర్యటించేవారని, తద్వారా ఆయనకు ప్రజా సమస్యలు తెలిసేవని చెప్పారు. చెన్నై రాయపేట రోడ్డులో గల శ్రీ బులుసు సాంబమూర్తి నివాసంలో నిరాహార దీక్ష ప్రారంభించారని, ఎంతో పట్టుదలతో దీక్షను కొనసాగించి చివరకు ప్రాణత్యాగం చేశారని వివరించారు. చెన్నైలోని  పొట్టి శ్రీరాములు స్మారక మందిరంతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గంగాధర ప్రసాద్ గుర్తు చేశారు. అనంతరం పలువురు టీటీడీ ఉద్యోగులు ప్రసంగించారు.

 

 

ముందుగా   పొట్టి శ్రీరాములు చిత్రపటానికి అతిథులు పుష్పాంజలి ఘటించారు.సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో   స్నేహలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు ఎఫ్ఏసిఏవో  రవి ప్రసాదు, డెప్యూటీ ఈఓ  గోవిందరాజన్, డిఈవోభాస్కర్ రెడ్డి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ, టీటీడీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags: Sri Potti Sriramulu is the idol of Telugu people : TTD JEO  Sada Bhargavi

Post Midle