కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
తిరుపతి ముచ్చట్లు:
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం స్వామివారు శ్రీ రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై దర్శమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహనంపై స్వామివారు దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని తెలియజేస్తున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. కాగా సాయంత్రం 5 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు సర్వభూపాలవాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ లోకనాధం, కంకణబట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags:Sri Prasanna Venkateswaraswamy in Rajamannar decoration on Kalpavriksha vehicle