రామనామస్మరణతో సాగిన శ్రీరామ పాదుకా పట్టాభిషేకం కవి సమ్మేళనం
తిరుపతి ముచ్చట్లు:
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన శ్రీరామ పాదుకాపట్టాభిషేకం కవి సమ్మేళనం రామనామస్మరణతో ఆకట్టుకునేలా సాగింది. టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తిరుపతికి చెందిన డా.ఇజి.హేమంత్ కుమార్ మాట్లాడుతూ రామాయణాన్ని పలువురు కవులు వారి దృష్టి కోణంతో విలక్షణంగా వర్ణించారని తెలిపారు. ఒకే సభలో ఆయా కవుల దృక్కోణాన్ని తెలుసుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు.అనంతరం ఎల్.జగన్నాథ శాస్త్రి ‘ గడియారం వెంకటశేష శాస్త్రి రామాయణం’, ఎం.మల్లికార్జునరెడ్డి ‘ రామాయణ కల్పవృక్షం’, వై.మధుసూదన్ ‘ రంగనాథ రామాయణం’, డా. సి.శివారెడ్డి ‘మద్ వాల్మీకి రామాయణం’, యు.భరత్ శర్మ ‘చంపూ రామాయణం’, డా. పి.నీలవేణి ‘మొల్ల రామాయణం’ అనే అంశాలపై తమ కవితా చాతుర్యాన్ని వినిపించారు.
ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు

టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉదయం ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు మంగళధ్వని వినిపించారు. ఆ తరువాత రంగాచార్యులు ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం ఎం.బి.లోకనాథరెడ్డి బృందం భక్తిసంగీతం వీనులవిందుగా సాగింది. రాత్రి జి.మునిలక్ష్మి బృందం హరికథాగానం చేశారు.
Tags; Sri Rama Paduka Pattabhishekam Kavi Sammelan, which was followed by Rama Namamaran
