పురుషామృగ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి
తిరుపతి ముచ్చట్లు :
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన ఆదివారం ఉదయం కామాక్షి సమేత శ్రీ సోమస్కంధమూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. ఉదయం 7 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. ఉదయం 10.30 గంటల నుండి స్నపన తిరుమంజనం(పవిత్రస్నానం) శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తి, కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధం, పన్నీరు, విభూదితో స్నపనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ దేవేంద్ర బాబు, ఏఈఓ పార్థసారధి, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

Tags: Sri Somaskandamurthy on Purushamriga vehicle
