టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ వారోత్సవాలు- జేఈవో సదా భార్గవి
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ విశిష్టతను దేశవ్యాప్తంగా తెలియజేయడం కోసం టీటీడీ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది నుంచి గంగమ్మ జాతర వారోత్సవాలు నిర్వహిస్తామని జేఈవో సదా భార్గవి తెలిపారు.శ్వేతలో తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర విశిష్టతపై ఉద్యోగులకు శుక్రవారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేఈవో మాట్లాడుతూ, గంగమ్మ జాతర వారోత్సవాలను మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తామన్నారు. తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి ఆలయ విశిష్టతను దేశ వ్యాప్తంగా తెలియజేయడం కోసం ఎంతో కృషి చేస్తున్నారని ఆమె చెప్పారు. గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటింప చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. టీటీడీ సహకారంతో ఆలయాన్ని నిర్మించడానికి ఎమ్మెల్యే చేసిన ప్రయత్నానికి చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ సహా అందరూ సహకరించారని చెప్పారు. హిందూ సంప్రదాయాలు ఆచారాలు మరుగున పడకుండా ఇలాంటి జాతరలు ఉపయోగ పడతాయని శ్రీమతి సదా భార్గవి అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సనాతన హిందూ ధర్మం, ఆచార, సంప్రదాయాల గురించి తెలియజేయాలన్నారు.

తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారు మహిళల రక్షణ కోసం ఉద్భవించారని జేఈవో వివరించారు.తిరుపతి గంగ జాతరను దక్షిణ భారత పండుగగా కూడా గుర్తించే రోజు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చెల్లిగా భావిస్తున్న శ్రీ తాతయ్య గుంట గంగమ్మ కు టీటీడీ ప్రతి ఏటా సారె పంపడం ఆనవాయితీగా పాటిస్తోందని చెప్పారు. గ్రామదేవతల వ్యవస్థ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నారు.
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ పోకల ఆశోక్ కుమార్ మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చెల్లెలు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని పునర్నిర్మానం చేసి జాతరను రాష్ట్ర పండుగ చేయడానికి తిరుపతి శాసనసభ్యులు శ్రీ కరుణాకర్ రెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పారు. తక్కువ సమయంలోనే ఆలయాన్ని పునర్నిర్మింపజేసి ఆద్భుతంగా జాతర చేయిస్తున్నారని అభినందించారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య మధురాంతకం నరేంద్ర మాట్లాడుతూ, వందేళ్ళ నుండి ఇప్పటి వరకు జరిగిన తిరుపతి అభివృద్ధి గురించి వివరించారు. విదేశాల్లోనూ గ్రామ దేవతలు ఉన్నారని అన్నారు.యోగి వేమన యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి ఆచార్య ఈశ్వర్ రెడ్డి గ్రామదేవతలు- ఆవిర్భావ వికాసాలు అనే అంశంపై ప్రసంగించారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద విజ్ఞాన శాఖాధిపతి ఆచార్య భక్త వత్సల రెడ్డి తాతయ్యగుంట గంగమ్మ జాతర- సామాజిక, సాంస్కృతిక నేపథ్యం గురించివిపులంగా వివరించారు. టీటీడీ మ్యూజియం ప్రత్యేకాధికారి ఆచార్య కృష్ణారెడ్డి తాతయ్యగుంట గంగమ్మ జాతర చరిత్ర గురించి తెలియజేశారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ ఆచార్య నల్లన్న గంగమ్మ పూజా పద్ధతుల గురించి తెలియజేశారు. తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి గంగమ్మ జాతరలో వేషాలసంస్కృతి- ప్రదర్శన గురించి వివరించారు.
శ్వేత డైరెక్టర్ ప్రశాంతి నేతృత్వంలో జరిగిన వర్క్ షాప్ లో ఎస్వీ యూనివర్సిటీ ఓరియంటల్ విభాగం ఆచార్యులు వెంకటేశ్వర్లు, పలువురు టీటీడీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అథితులను శాలువా తో సన్మానించి స్వామివారి ప్రసాదాలు, చిత్రపటం అందించారు.
Tags:Sri Tataya Gunta Gangamma Week Festivals under TTD- JEO Sada Bhargavi
